
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : టీడీపీ సర్కారు పాలనా వైఫల్యాలు, తమకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించడంపై నిలదీసేందుకు ఏలూరులో నేడు ఏర్పాటు చేసిన బీసీ గర్జనలో పాల్గొనేందుకు బీసీ సంఘాలు, కార్యకర్తలు తండోపతండాలుగా బయలు దేరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు వంద బస్సులు, వంద కార్లతో ర్యాలీగా బయల్దేరారు.
బీసీ సంఘ నాయకులు వేండ్ర వెంకటస్వామి, కామన నాగేశ్వరరావు, తిరుమాని ఏడు కొండలు, కొల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో తణుకు నియోజక వర్గం నుంచి మూడు మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు బీసీ గర్జనకు బయల్దేరారు. సభకు వెళ్తున్న అభిమానులకు తణుకు వైస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి ఆహార పానియాలను ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెం వైస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సోదరులు వేలాది తరలి వెళ్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి దాదాపుగా 150 బస్సులు, వంద కార్లతో బీసీ గర్జనకు బయల్దేరారు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండలాల నుంచి ఆచంట కన్వీనర్ చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఆధ్వర్యంలో 200 బస్సుల్లో గర్జనకు బీసీ సోదరులు బయల్దేరారు.
విజయవాడ నుంచి బీసీ గర్జనకు బీసీలు భారీ సంఖ్యలో బయల్దేరారు. పిఠాపురం వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ఛలో ఏలూరు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.