దగాపడ్డ బీసీ గళాల ‘గర్జన’ నేడే  | YSRCP BC Garjana Is Today | Sakshi
Sakshi News home page

దగాపడ్డ బీసీ గళాల ‘గర్జన’ నేడే 

Published Sun, Feb 17 2019 5:06 AM | Last Updated on Sun, Feb 17 2019 7:59 AM

YSRCP BC Garjana Is Today - Sakshi

ఏలూరులో బీసీ గర్జన జరిగే సభా ప్రాంగణం

సాక్షి, అమరావతి, ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్ల ప్రజా కంటక టీడీపీ సర్కారు పాలనా వైఫల్యాలు, తమకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించడంపై నిలదీసేందుకు బీసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆదివారం ఏలూరులో వైఎస్సార్‌ సీపీ నిర్వహిస్తున్న కీలకమైన ‘బీసీ గర్జన ఇందుకు వేదిక కానుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ‘బీసీ డిక్లరేషన్‌’ ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. బీసీలకు కంటితుడుపు చర్యలా కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చే పథకాలు కాకుండా వారు నిజమైన అభివృద్ధి చెందేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించేలా డిక్లరేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 

ఏడాదిన్నర క్రితమే కమిటీని నియమించిన జగన్‌
బీసీల్లో వివిధ కులాల స్థితిగతులు, వెలుగులోకి రాని కొన్ని కులాల ఈతి బాధలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వైఎస్‌ జగన్‌ సుమారు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా పర్యటించి బీసీ వర్గాల సమస్యలేమిటో వారి నుంచే స్వయంగా తెలుసుకుంది. బీసీ వర్గాల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలతో విపులంగా చర్చలు జరిపింది. జిల్లాలవారీగా వెలుగులోకి వచ్చిన కొత్త సమస్యలను క్రోడీకరించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలిచ్చి మోసగించడంతో బీసీల పరిస్థితి ఎలా దిగజారిందో వివరిస్తూ కమిటీ ఈ ఏడాది జనవరి 28వ తేదీన జగన్‌కు సమగ్ర నివేదిక సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రైతులు, మహిళలకు రుణాల్లో రాయితీలు లాంటి అనేక పథకాలతో బీసీలకు మేలు జరిగింది.

ఇప్పుడు ఆ పథకాలకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండటంతో బీసీలకు తీరని నష్టం కలుగుతోందనే అంశాన్ని అధ్యయన కమిటీ జగన్‌ దృష్టికి తెచ్చింది. మరోవైపు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు, చేతి వృత్తుల ప్రతినిధులు జగన్‌ను నేరుగా కలుసుకుని తమ కష్టాలను విన్నవించుకున్నారు. వారి కష్టాలను ప్రతిపక్ష నేత స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడంతోపాటు వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తామని గర్జన ద్వారా భరోసా కల్పించనున్నారు.

హామీలపై ప్రశ్నిస్తే కన్నెర్ర
బీసీలను ఓటు బ్యాంకుగా భావిస్తూ దీర్ఘకాలం పాటు వారిని టీడీపీ మోసగించింది. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే పలు సందర్భాల్లో వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎస్సీల జాబితాలో చేరుస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరిన మత్స్యకారులపై విశాఖలో ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘ఏం తమాషాగా ఉందా? నాకు గుర్తులేదా? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదా?’ అంటూ కన్నెర్ర చేశారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని ఉద్యమించిన పాతపాటి అంజిబాబును టీడీపీలో చేర్చుకుని నోరెత్తకుండా చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు తాత్కాలిక సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను వేలుతో బెదిరిస్తూ తమాషాలు చేస్తున్నారా? తోకలు కట్‌ చేస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 

ఐదున్నర లక్షల మందికి నిరాదరణే!
ఆదరణ పథకం కింద బీసీ కులాలకు చెందిన 7,67,137 మంది దరఖాస్తు చేసుకోగా సర్కారు ఇప్పటి వరకు రెండు లక్షల మందికి కూడా వస్తువులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అరకొరగా ఇచ్చినవి కూడా నాసిరకం కావడంతో మర్నాడే పనికిరాకుండా పోయాయి. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రుణమాఫీపై నేతన్నలను నిలువునా మోసం చేసింది. రూ.111 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే రూ.75 కోట్లతో సరిపెట్టి చేతులు దులుకొంది. చేనేతలకు ఆరోగ్య బీమా అందిస్తామన్న హామీని నాలుగున్నర ఏళ్ల పాటు పట్టించుకోలేదు. వీవర్స్‌ క్రెడిట్‌ పథకాన్ని గాలికి వదిలేసింది. చేనేత బట్టలు కొనుగోలు చేయడంలో ఆప్కో విఫలమైంది. 

సబ్‌ప్లాన్‌... మభ్యపెట్టే ప్లాన్‌
అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కింద రాష్ట్రంలో 99 లక్షల మంది ఉండగా వారిని ఆదుకుంటామని చెప్పిన టీడీపీ సర్కారు కేవలం రూ.వంద కోట్లు కేటాయించి సరిపుచ్చింది. ఇక హడావుడిగా ప్రవేశపెట్టిన బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లు సరిగా లేదని స్వయంగా స్వపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులే ఆక్షేపించినా పట్టించుకోకుండా బలహీన వర్గాలను మభ్యపెట్టే యత్నం చేసింది. జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాల్సి ఉండగా సరైన విధానం లేకుండా 1/3 నిధులు ఇస్తామంటూ ఓ కాగితంపై రాసిన వ్యాక్యాలను అసెంబ్లీలో మంత్రి చదివి వినిపించారు. 
 
ఫీజుల పథకానికి ఐదు లక్షల మంది దూరం

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు అర్హులైన బీసీ విద్యార్థులు 10,10,145 మంది ఉన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజుల పథకం లక్షల మంది పేద విద్యార్థులకు చదువుల వెలుగును పంచింది. ఇలాంటి పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. 2018–19లో 1,73,492 మంది బీసీ విద్యార్థులకు ఇంతవరకు ఫీజులు చెల్లించలేదు. 3,25,811 మందికి మాత్రం కొద్ది మొత్తం విదిల్చింది. దాదాపు ఐదు లక్షల మంది బీసీ విద్యార్థులకు ఫీజుల పథకం అమలు కాలేదు. 2018–19లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు కలిపి బీసీ విద్యార్థులకు రూ.882.74 కోట్లు దాకా ప్రభుత్వం బకాయి పడింది.

బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారా?
బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ కేంద్ర న్యాయశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడం బలహీన వర్గాల పట్ల ఆయన చిన్నచూపును రుజువు చేస్తోంది.

బీసీలకు బాబు నెరవేర్చని హామీలు
– రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మార్కెటింగ్‌ కమిటీల నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో బీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. 
– యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్లు, పాలక మండళ్లలో 33 1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేదు. 
– బీసీల జనాభా గణన చేయించి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. 
– వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న జీవనోపాదుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రణాళికా వ్యయంలో ఏటా 25 శాతం నిధులు బీసీ ఉపప్రణాళిక కింద కేటాయిస్తామన్న హామీని పట్టించుకోలేదు. 
– కేంద్రంలో కూడా 25 శాతం నిధులతో ఉపప్రణాళిక కోసం కృషి చేస్తామన్న హామీ ఊసే లేదు.
– విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 33 1/3 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించారు.  
– కాంగ్రెస్‌ హయాంలో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు కసరత్తు జరిగితే దాన్ని అమలు చేసేందుకు టీడీపీకి నాలుగున్నరేళ్ల సమయం చాలలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం లేని కులాలకు నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఎంబీసీ కార్పొరేషన్‌కు గోవిందరెడ్డిని చైర్మన్‌గా నియమించారు. 
– బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అదనపు సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. 
– ఆధార్‌తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ఇచ్చిన హామీని అటకెక్కించారు. నాణ్యమైన విద్య, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్న హాస్టళ్లనే రద్దు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కింది. 
– స్కాలర్‌షిప్‌ల కోసం బీసీల ఆదాయ పరిమితిని రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షలకు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. 
– కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అన్ని సౌకర్యాలతో ‘వృత్తి సముదాయాలు’ ఏర్పాటు చేస్తామన్న హామీని మరిచారు. 
– వాల్మీకి/బోయ, వడ్డెర, రజకుల సామాజిక హోదాలో మార్పులు తెస్తామన్న హామీ నెరవేర్చలేదు. 
– బీసీ కుల వృత్తులపై విధించిన వృత్తిపన్ను, సేవల పన్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారు. 
– చేనేతలకు రూ. 1,000 కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్‌లో ఏటా రూ. 1,000 కోట్లు కేటాయిస్తామన్న హామీ నెరవేరలేదు. 
– రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత చేనేత బజార్‌లు ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారు.
– వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరంలలో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్న చెప్పి ఆ ఊసే మరిచారు.
– జనతా వస్త్రాల పునరుద్ధరణ పథకాన్ని అటకెక్కించారు.
– మూతపడిన చేనేత సంఘాల పునరుద్ధరణ, బకాయిల రద్దు, మూలధన సాయంతోపాటు 50 శాతం సబ్సిడీతో మగ్గాలు సరఫరా చేస్తామన్న హామీ అమలు కాలేదు. 
– చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు.
– హైబ్రిడ్‌ విత్తనాలను సరఫరా చేసి కల్లు గీత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్న
సర్కార్‌ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడిచెట్లను పూర్తిగా తొలగించి గీత కార్మికుల పొట్ట కొట్టింది. 
– సముద్ర తీరంలోని భూములను మత్స్యకారులకు కేటాయిస్తామన్న హామీ నెరవేరలేదు. 
– రైతు బజార్ల మాదిరిగా మేకలు, గొర్రెల విక్రయ బజార్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదు. 
– గొర్రెల మేత కోసం ఆయా గ్రామాల్లో భూముల కేటాయింపు హామీ నెరవేరలేదు. 
– డోలు, సన్నాయి తదితర వాయిద్య కళాకారులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చ లేదు. 
– జైళ్లు, ఆస్పత్రులు, దేవస్థానాల్లో క్షురకులు, దేవాలయాల్లో వాయిద్య కళాకారుల ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చలేదు.
– అధునాతన క్షౌ రశాలల నిర్వహణకు శిక్షణ, 50 శాతం సబ్సిడీతో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. 

ఏలూరులో బీసీ గర్జనకు సర్వం సిద్ధం
వైఎస్సార్‌ సీపీ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమవుతుంది. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్‌షిప్‌ పక్కనే జరిగే సభ ప్రాంతానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని బీసీ నేతలను ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఈ సభకు తాను హాజరవుతున్నట్లు ప్రకటించారు. సభ ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, నర్సయ్య గౌడ్, చిల్లపల్లి మోహనరావు తదితరులు శనివారం పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement