సాక్షి, అమరావతి : ఎన్నో ఏళ్లుగా..సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధికి నోచుకోక కునారిల్లుతున్న వెనుకబడిన వర్గాల సర్వతోముఖాభివృద్ధి సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జన జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాల ప్రజలు తరలి రానున్నారు. ‘ఛలో ఏలూరు’ నినాదంతో బీసీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై రాష్ట్రంలోని బీసీలు రగిలి పోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరచిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించిన వైనంపై ప్రస్తుతం ఆ వర్గాల్లో చర్చ సాగుతోంది.
బీసీలను అవసరాలకు ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని ఆ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక 2019 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పాత హామీలను అమలు చేయక పోగా.. మళ్లీ కొత్తగా మోసాలు చేసేందుకు చంద్రబాబు ముందుకొస్తున్న వైనంపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అనేకమార్లు గళం విప్పింది. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నో సార్లు కోరింది. అయితే ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు మాటలతో కాలక్షేపం చేస్తున్న టీడీపీ వైఖరిని ఎండగట్టడంతో పాటుగా.. 2019లో తాము అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి ఏం చేయబోతామో తెలియ జేసి ఆ వర్గాలకు భరోసా కల్పించడానికే బీసీ గర్జనను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముందు చూపుతో జగన్ సుమారు ఏడాదిన్నర క్రితమే పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సాధ్యమైనంత వరకు అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీసీ వర్గాల స్థితిగతులనూ కమిటీ తెలుసుకుంది. ఈ క్రమంలో సుమారు 136 కులాల వారితో చర్చించి..వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నామని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కాగా, కమిటీ ఓ సమగ్ర నివేదిక రూపొందించి ఈ ఏడాది జనవరి 28న జగన్‌కు సమర్పించింది.
రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికే డిక్లరేషన్..
అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దివారం జరిగే ఏలూరు బీసీ గర్జన సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించబోతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం చేపట్టే చర్యలను డిక్లరేషన్‌లో పొందుపరిచారు. టీడీపీ హయాంలో బీసీల జీవన విధానంలో ఎలాంటి మార్పు లేని విషయాన్ని గర్జనలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. బీసీలపై గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించడానికి తీసుకునే ప్రత్యేక చర్యలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. సంప్రదాయకంగా కుల వృత్తులపై ఆధారపడే వారి పరిరక్షణ, వారు నిలదొక్కుకునే విధంగా ప్రోత్సాహకాలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థికంగా బీసీలు ఎదగడానికి వీలుగా పారిశ్రామికరంగంలో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి బీసీ డిక్లరేషన్‌లో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయమై కూడా జగన్ ఈ సందర్భంగా ఒక విస్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ఏర్పాట్లు..
ఏలూరు పరిసరాల్లోని సర్ సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి సమీపంలోని సువిశాలమైన మైదానంలో బీసీ గర్జన వేదికను నిర్మించి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గర్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, కంతేటి సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో సహా పలువురు వేదిక ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
రేపు వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన
Published Sat, Feb 16 2019 5:08 AM | Last Updated on Sun, Feb 17 2019 12:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment