‘విజయ’తీరాన తు‘ఫ్యాన్‌’ | YSRCP Clean Sweep In Vizianagaram District | Sakshi
Sakshi News home page

‘విజయ’తీరాన తు‘ఫ్యాన్‌’

Published Fri, May 24 2019 2:10 PM | Last Updated on Fri, May 24 2019 2:32 PM

YSRCP Clean Sweep In Vizianagaram  District - Sakshi

జిల్లాలో ఫ్యాన్‌ సృష్టించిన సునామీలో ప్రత్యర్థులు తుడిచిపెట్టుకుపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అటు శాసనసభ, ఇటు పార్లమెంటు స్థానాల్లో ప్రభంజనం సృష్టించారు. ఒక్కస్థానాన్నీ తెలుగుదేశం పార్టీకి దక్కనీయకుండా క్లీన్‌ స్వీప్‌ చేశారు. రౌండ్‌ రౌండ్‌కూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వరుసగా వెలువరించిన ఫలితాలతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు రేకెత్తించా రు. అసలు అభ్యర్థుల ఎంపికతోనే టీడీపీ తప్పటడుగులు వేస్తూ వైఎస్సార్‌సీపీ విజయానికి పరోక్షంగా దోహదపడగా... పార్టీ అధినేత జగన్‌ చరిష్మా వారికి అదనపు బలాన్ని అందించినట్టయింది. మొత్తమ్మీద ప్రజలు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారనీ... జగన్‌పై ఎనలేని అభిమానం చూపారనీ... ఈ ఫలితాలు రుజువు చేశాయి.

సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని సాధించింది. జిల్లా ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున విజయతిలకం దిద్దారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి అడ్రస్‌ లేకుండా చేశారు. గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీగా అధికారులు ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టంగట్టి తొమ్మిది అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను అందించారు.

ఎన్నిక ఏకపక్షం
జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే చాలా మెరుగైన ఫలితాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని విజయనగరం లోక్‌సభతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా కురుపాం, సాలూరు, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిపొందింది.

పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయనగరం పార్లమెంటు స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించడంతో వైఎస్సార్‌సీపీ బలం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకు పరిమితమైంది.

కానీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగిరేసి సత్తా చూపింది. ఒకేసారి జిల్లాలో వైభవాన్ని కోల్పోయిన తెలుగుదేశంపార్టీ ఒక్కసీటులో కూడా గెలవలేక చతికిలపడిపోయింది. 
వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ
ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో గెలు పొందడం ఒక విశేషమైతే పోటీ చేసిన అన్నిచోట్లా భారీ మెజార్టీ రావడం మరో విశేషం. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్‌గజపతిరాజుపై అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎంపీ, టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజవంశీకులైన పూసపాటి ఆశోక్‌గజపతిరాజుపై బెల్లాన గెలపొందడంతో తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడినట్టయ్యింది. 

⇔ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాముల శ్రీపుష్పవాణి టీడీపీ అభ్యర్థి నరసింహప్రియా థాట్రాజ్‌పై 27,394 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ పుష్పశ్రీవాణికి 69484ఓట్లు           రాగా ఆమె సమీప ప్రత్యర్థికి 44090 ఓట్లు లభించాయి.

⇔ పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అలజంగి జోగారావు 23,814ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 70,626 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చీరంజీవులుకు 49,812         ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న నమ్మకం మొదట్నుంచీ ఉన్నా భారీ స్థాయిలో మెజార్టీ రావడం విశేషం.

⇔ బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు 75,332ఓట్లు రాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడుకు 83,678ఓట్లు రావడంతో 8346 మెజార్టీ లభించింది. ఇక్కడ                మంత్రిపై పోటీ చేసి గెలుపొందడం గ్రాండ్‌ విక్టరీగా చెప్పుకోవాలి. ఆరంభంలో విజయావకాశాలు టీడీపీకి ఉన్నట్లు కనిపించినా పక్కా ప్రణాళికతో వైఎస్సార్‌సీపీ ఈ సీటును సొంతం చేసుకుంది.

⇔ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మొత్తం 29,051ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 94,258 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, కాకలు తీరిన రాజకీయయోధుడు, సీనియర్‌ నాయకుడు            పతివాడ నారాయణస్వామినాయుడుకు 66,207 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉంది. 

⇔ విజయనగరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 78,849ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆదితిగజపతిరాజుకు 72,432 ఓట్లు వచ్చాయి. కోలగట్ల 6417ఓట్లు మెజార్టీతో        గెలుపొందారు. ఇక్కడ మొదటి నుంచి పోటీ తీవ్రంగా ఉంటుందన్న చర్చ జరిగింది. అనుకున్నట్లే ఉత్కంఠ నడుమ అంతిమంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

⇔ సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి పీడక రాజన్నదొర 19,500ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 73,291ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఆర్‌.పి.భంజ్‌దేవ్‌కు                 53,791 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గెలుస్తామని టీడీపీ గట్టి నమ్మకంతో ఉండగా భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం విశేషం. రాజన్నదొర నాలుగోసారి గెలిచి తనకు ఎదురులేదని మరోసారి                 నిరూపించారు.

⇔ శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 89,653 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి 78,097ఓట్లు లభించాయి. కడుబండి 11,556 ఓట్ల ఆధిక్యంతో విజయం                 సాధించారు. గెలుపుపై ఎటువంటి అం చనాలు లేకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బరిలో దిగినా పోలింగు రోజు నాటికి అనూహ్యంగా పుం జుకుని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.

⇔ చీపురుపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 87,508 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు 61,671 ఓట్లు లభించాయి. బొత్స సత్యనారాయణ 26,498 ఓట్లు మెజార్టీతో             గెలుపొందారు. అందరూ ఉహించినట్లే బొత్సకు భారీ మెజార్టీ లభించింది. 

⇔ గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యకు 26,910 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈయనకు 92,863 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి కె.ఎ.నాయుడుకు 65,953ఓట్లు               లభించాయి. ఇక్కడ భారీ మెజార్టీ వస్తుందని, గెలుపు లాంఛనమే అని ముందే ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement