Vizanagaram
-
కాబోయే అమ్మకు ఎంత కష్టమో.. !
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌక ర్యం కల్పించాలని గిరిజన పెద్దలు జె.గౌరీషు, ఆర్.శివ, సన్యాసిరావు, మాజీ సర్పంచ్ మాదల బుచ్చయ్య కోరారు. -
ఘనంగా పందిరి రాట ఉత్సవం
-
విజయనగరంలో గుజరాత్ యువతుల హల్చల్
-
26 వేల మంది పబ్లిక్, ప్రైవేటు హెల్త్ సిబ్బందికి వ్యాక్సిన్
సాక్షి, విజయనగరం: దేశంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సి్న్ తొలి టీకా అందించనున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది పబ్లిక్, ప్రైవేటు హెల్త్ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామని వెల్లడించారు. 5 రోజుల వరకు ఈ కార్యక్రమం చేపడతామని, జిల్లాలో 15 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సెంటర్ ద్వారా రోజుకి 100 మందికి వ్యాక్సిన్ అందిస్తామని, ఫ్రెంట్ లైన్ వారియర్స్‌కు అందరికి వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి, బాలింతలకి వ్యాక్సిన్ వేయబడదన్నారు. రెండో విడత కూడా ఇదే రకం వ్యాక్సిన్ అందజేయాలన్నారు. ఇప్పడు వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి మరలా 28 రోజుల తర్వాత రెండో విడత వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ అందజేస్తామని, ఎవరూ తొందరపడొద్దని మంత్రి పేర్కొన్నారు. -
24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం
సాక్షి, విజయనగరం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా భోగాపురంలో 11 సెంటిమీటర్లు, కొత్తవలసలో 10 సెంటిమీటర్లు, డెంకాడలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వేపాడ, మెంటాడ, జామి, పూసపాటిరేగ, బొండపల్లిలలో 7 సెంటిమీటర్లు నమోదు కాగా ఎల్ కోట, విజయనగరం, గరివిడి, గుర్ల, గజపతినగరం, పాచిపెంట, గుమలక్ష్మిపురంలలో 6 సెంటీమీటర్లుగా నమోదైంది. ఎస్ కోట, గంట్యాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, తెర్లాం, రామభద్రాపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లిల్లో 5 సెంటీ మీటర్లు.. దత్తిరాజేరు, బాడంగి, బొబ్బిలి, జేఎం వలసలలో 4 సెంటీమీటర్లు.. కురుపాం, మక్కువ, సీతానగరం, బలిజిపేటలలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతలం నమోదైంది. -
‘అందుకే బాబును ప్రజలు ఇంటికి పంపారు’
సాక్షి, విజయనగరం: ప్రజా చైతన్యం ఉండబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక ప్రజా చైతన్య యాత్ర దేని కోసం నిర్వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామీ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ హోం మంత్రి చిన రాజప్ప లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ పర్యటన జయప్రదంగా ముగిసిందని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగలేదన్నారు. ఉగాది రోజున ఇల్లు లేని వాళ్లందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, కుల, మతాలు చూడకుండా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. పాలనలో దేశంలోనే ఆదర్శ సీఎం జగన్ అన్నారు. అర్హత కలిగిన వాళ్లందరికి పెన్షన్లు పునరుద్ధరణ చేశామని ఆయన తెలిపారు. మద్య నిషేధ అమలులో భాగంగా బెల్ట్ షాప్‌లను లేకుండా చేశామని తెలిపారు. ఆనాడు మద్యం సిండికేట్‌లో ప్రతికపక్ష నాయకులను అరెస్టు చేయిస్తామని చంద్రబాబు బెదిరించారన్నారు. మూడు రాజధానులు కొత్తేమీ కాదని, ఆనాడు మద్రాస్ నుంచి కర్నూలుకి మర్చలేదా, హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చలేదా అని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో పారిశ్రామిక వేత్తల సదస్సును అమరావతిలో కాకుండా.. విశాఖలో ఎందుకు పెట్టారని, అక్కడ అభివృద్ధి ఏమి లేదని అందరికి తెలిసిపోతుందనా? అని ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్లనే బాబుని ప్రజలు ఇంటికి పంపించారని విమర్శించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్రకి ప్రజలు ఎవరూ రారని, మద్దతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. -
చేపల వేటకు వెళ్లి.. బంధీలయ్యారు!
సముద్రమే వారి ప్రపంచం... చేపల వేటే వారి జీవనాధారం. ఉన్న ఊళ్లో ఉపాధి లేక సుదూర ప్రాంతానికి పయనం. గమ్యం తెలియని సంద్రంలో... ఏది మన దేశ మో... ఏది పరాయి దేశమో... తెలుసుకోలేని అమాయకత్వం. ఇదే వారి కొంప ముంచుతోంది. మొన్న శ్రీలంక... నిన్న పాకిస్తాన్... నేడు బంగ్లాదేశ్.. ఇలా ఏదో ఒక సరిహద్దు దేశంలోకి పొరపాటున చొరబడుతున్నారు. అక్కడి రక్షణశాఖలో బందీలుగా మారుతున్నారు. బతుకు తెరువుకోసం వెళ్లిన తమ వారు ఎప్పుడు ఏ చిక్కుల్లో పడతారో తెలియక ఇక్కడివారు నిరంతరం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బందీలైనవారు విడుదల కాక... మళ్లీ మరో ఎనిమిది మంది వేరే దేశంలో చిక్కుకోవడంతో తిప్పలవలసలో కుటుంబాలు కలవరపడుతున్నాయి. సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లో ప్రవేశించారు. ఈ విషయం తెలిసి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దసరా పండగకు వస్తానని చెప్పి వెళ్లిన మత్స్యకారులు బందీలుగా చిక్కడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వేటకు వెళ్లేటప్పుడు కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లిన మత్స్యకారుల కుటుంబాలు తమవారు బందీలుగా చిక్కారని తెలియగానే ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వస్తారో... అసలు వస్తారో రారో... తెలియక అల్లాడిపోతున్నారు. కనీసం తమవారితో అధికారులు ఫోన్లో మాట్లాడించేలా చూడాలని బోరున విలపిస్తున్నారు. బందీలుగా చిక్కినది ఇలా... భారతదేశ సముద్ర జలాల్లో వేట కోసం తిప్పలవలసకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు వెళ్లారు.. పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లి చేపల వేట చేస్తుండగా ఆ దేశ రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. విషయం గురువారం రాత్రి తెలియడంతో తిప్పలవలస గ్రామంలో అలజడి మొదలైంది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి నర్సింహులు, బర్రి రాము, వాసుపల్లి అప్పన్న, రాయితి రాములు, వాసుపల్లి కాములు విశాఖ హార్బర్ నుంచి ఎఫ్‌వీఎస్‌ఎం 800 నంబర్ బోటులో సెప్టెంబర్ 24వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లారు. పొరపాటున వారు భారత సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఈ నెల రెండో తేదీ సాయంత్రం నాలుగు గం టల సమయంలో వారిని బంగ్లా రక్షణ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని వారితోపాటే వేట చేస్తున్న మరికొందరు బోటు యజమాని వాసుపల్లి రాముకు సమాచారం ఇచ్చారు. నిత్య ప్రమాదం ఉన్న ఊళ్లో వేటసాగక పోవడంతో ఇక్కడి మత్స్యకారులు వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. అలా వేటాడే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కావట్లేదు. గతేడాది సెప్టెంబర్‌లో చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలో గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. ఇదే మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన కొంతమంది మత్స్యకారులు 2018 ఆగస్టు 15వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్‌కు వెళ్లారు. గతేడాది నవంబర్ 19వ తేదీన హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరారు. నవంబర్ 29న పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క దనరాజు, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. వారెవ్వరూ ఇంకా విడుదల కాలేదు.. కుటుంబ సభ్యుల రోదనలు బంగ్లాదేశ్‌లో బందీలుగా చిక్కిన తిప్పలవలసకు చెందిన వాసుపల్లి అప్పన్న ఇద్దరు భార్యలు మారుపల్లి తోటమ్మ, మారుపల్లి దానయ్యమ్మ విషయం తెలిసి బోరుమన్నారు. దసరా పండగకు వేట ముగించుకొని వస్తానని చెప్పి ఇంతలోనే బందీగా చిక్కావా అని కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన పాకిస్తాన్లో బందీలుగా చిక్కిన వారే ఏడాది కావస్తున్నా విడుదల కాలేదు. ఇక తమ వారి పరిస్థితి ఎమిటని గుండెలు బాదుకుంటున్నారు. బందీగా చిక్కిన వాసుపల్లి అప్పన్న తల్లి గురమ్మ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. 10 రోజుల్లో వేట ముగించుకుని వస్తామని చెప్పి ఇలా చిక్కుకోవడంతో ఆమె కలవరపడుతోంది. ఇంకా బర్రి రాము, వాసుపల్లి కాము, రాయితి రాము, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విడుదల చేయించండి బాధిత కుటుంబాలను మెరైన్ సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ తారక్, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినఅప్పన్న, పలువురు అధికారులు పరామర్శించారు. బందీలుగా వున్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం స్పందించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి...
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజారంజక పాలనతో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో పట్టణంలోని 31వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వింత ప్రభారరరెడ్డి, వింత సందీప్, యార్లగడ్డ భవాని, యార్లగడ్డ సుబ్బారావుల ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కోలగట్ల, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ దివంగత యార్లగడ్డ రంగారావు కుటుంబ సభ్యులు, వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న ప్రజారంజక పాలన, నియోజకవర్గంలో తన నాయకత్వాన్ని, మంత్రి బొత్స నాయకత్వాన్ని నచ్చి మెచ్చి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. వీరి రాకతో నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందన్నారు. విజయనగరం పట్టణంలో ఇప్పటికే 18 వార్డుల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి చేశామని, మిగతా వార్డుల్లో కూడా త్వరితగతిన పర్యటించి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్, తాను విజయనగరం పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వింత ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజారంజక పాలన చూసి పార్టీలో చేరామన్నారు. వీరితో పాటు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు జి.చంద్రరావు, జి.కృష్ణ, ఎన్.రమణ, ఆర్.ఎస్.కె. రాజు, రాజేష్ రాజు, శ్రవంత్ వర్మ, శేఖర్, పైడి రాజు, జి.గౌరీ, ప్రమీల, రమ, ఆదినారాయణతో పాటు 150మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, 31వ వార్డు ఇన్చార్జి తోట రాజశేఖర్, పార్టీ నాయకులు గంగ, పిన్నింటి రామలక్ష్మి, సాగర్, జాతవేద, వర్మ ఉన్నారు. -
నవశకానికి దిశానిర్దేశం
సాక్షి, విజయనగరం : అమరావతిలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి అజెండాను ప్రభుత్వం రెండురోజుల క్రితమే ఖరారు చేసింది. ఈ సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నవరత్నాలపై చర్చకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఉన్న పలు పథకాల అమలు గురించి అజెండాలో చేర్చా రు. వీటితోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపైనా దృష్టిసారించారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై ఫోకస్ చేశారు. అందులో మొదటిది గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యవస్థతోపాటు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లోకి రానున్న గ్రామ వలంటీర్ల గురించి చర్చించాలని నిర్ణయించారు. ఆరో గ్యశ్రీ పథకం అమలు, 108, 104 సేవలు రెండో ప్రాధాన్యత అంశంగా చేర్పించారు. సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ, సన్నబియ్యం పంపిణీ మూడో అంశంగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లల నమో దు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అంశం తర్వాత చర్చిస్తారు. కరువు, ప్రస్తుతం పంటలు సాగు పరిస్థితి, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షిస్తారు. వైఎస్సార్ భద్రతా రాష్ట్రంలో జనరంజక పాలన మొదలైంది. వివిధ వర్గాలవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. దానిపై ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారు. ఇక క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన సూచనలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అవసరమైన జిల్లా సమాచారంతో కలెక్టర్ హరిజవహర్‌లాల్ అమరావతికి పయనమయ్యారు. పెన్షన్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై అధి కా రుల నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వీటిపై మార్గనిర్దేశనం చేస్తారు. పూర్తి సమాచారంతో వెళ్లిన కలెక్టరు ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ శనివారం సాయంత్రం జిల్లా నుంచి వెళ్లారు. ఆదివారం స్థానికంగా పనులు చూసుకుని సోమవారం సమావేశానికి హాజరవుతారు. కలెక్టర్ల సదస్సు ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ముందే ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆ మేరకు పూర్తి సమాచారంతో కలెక్టర్ పయనమయ్యారు. కొత్త ముఖ్యమంత్రితో తొలి సదస్సు కావడంతో అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారంతోపాటు... మరింత ఇతర సమాచారాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లా పరిస్థితులపై నివేదిక ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ హరి జవహర్లాల్ ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. జిల్లాలో 919 గ్రామపంచాయతీల్లో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేసి తీసుకెళ్లారు. వారితోపాటు 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియామకానికి సంబంధించి నివేదిక తయారు చేశారు. అందులో జిల్లాలో 10,012 మంది వలంటీర్లు అవసరమని పేర్కొన్నారు. ⇔వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 108 వాహనాలు 27, 104 వాహనాలు 19 ఉన్నట్లు కలెక్టర్ సీఎంకు నివేదించనున్నారు. వీటికి అదనంగా 108 వాహనాలు 9, 104 వాహనాలు 8 కావాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ⇔ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ అంశం గురించి కలెక్టర్ సీఎంకు నివేదిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 7,13,053 కార్డులు ఉన్నాయని, ఆయా కార్డులకు 1,20,784 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందని, ఇందుకు అవసరమయ్యే వలంటీర్ల గురించి కూడా కలెక్టర్ వివరిస్తారు. ⇔విద్యకు సంబంధించి పిల్లల నమోదు, పుస్తకాల పంపిణీ, యూనిఫాం పంపిణీ గురించి నివేదిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1,44,356 మంది పిల్లలు బడిలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం లెక్కన పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54.90శాతం పంపిణీ చేశారు. పుస్తకాలు పంపిణీ కూడా 80శాతం పూర్తయింది. మిగతా పంపిణీకి సంబంధించి కార్యాచరణ వివరించనున్నారు. అమ్మ ఒడి పథకంలో అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాగా ఆ విషయం కలెక్టరు వివరించనున్నారు. ⇔జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రకటించిన కరువు మండలాలకు రావాల్సిన పంటల నష్ట పరి హారం గురించి కలెక్టర్ ప్రస్తావించనున్నారు. ఖరీ ఫ్లో 8,917 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు 24,320మంది రైతులకు రూ.13.37 కోట్లు పంటల నష్ట పరిహారం రావాల్సి ఉంది. రబీలో 9388 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 30,893మంది రైతులకు రూ.9.25కోట్లు పరిహా రం రావాలి. సదస్సులో కలెక్టర్ ఈ అంశం ప్రస్తావించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల ఆలస్యం తదితర అంశాలు వల్ల కలిగే ఇబ్బందులు నివేదించనున్నారు. ⇔జిల్లాలో 1,06,126మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు మొత్తం పెంపు తర్వాత నెలకు రూ.71.35కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశంతో పాటు 60 ఏళ్లకు తగ్గిస్తే అదనంగా పెరిగే పెన్షనర్ల గురించి కూడా చర్చించనున్నారు. ⇔జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23,405 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చూస్తోంది. వీటిపై వివరాలు కోరింది. అయితే ప్రస్తుతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండే లబ్ధిదారులు లేరని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. ⇔ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 13,218 జారీ చేశారు. ఈ వివరాలు కోరడంతో కలెక్టర్ సమాచారం సేకరించారు. దీని ఆధారంగా నూతన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. -
నకిలీ మావోయిస్టుల ఆటకట్టు
సాక్షి, విజయనగరం: జిల్లాలోని సాలూరు నియోజకవర్గ గిరిజన ఏజెన్సీ గ్రామాల్లో నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ నలుగురు నకిలీ మావోయిస్టులను సాలూరు పోలీసులు పట్టుకున్నారు. సాలూరు సర్కిల్ పరిధిలో పోలీసులు ఒక బృందంగా ఏర్పడి పకడ్బంది వ్యూహంతో మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది కాలంగా నలుగురు వ్యక్తులు తాగుడు, చెడు వ్యసనాలకు బానిసై.. గ్రామాల్లో డబ్బు పలుకుబడి ఉన్న వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. వీళ్లు గత రెండు నెలలుగా చిట్టినాయుడు, ఎల్ఐసీ ఏజెంట్ గౌరినాయుడిని బెదిరించి వారి నుంచి సుమారు ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండు రోజుల నుంచి చెముడు గ్రామానికి చెందిన రామానాయుడు అనే వ్యక్తికి కూడా ఫోన్ కాల్స్ చేస్తూ.. తాము నక్సలైట్లమంటూ డబ్బులు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే అంతు తేలుస్తాం అంటూ బెదిరించారు. రామానాయుడు ముందస్తుగా రూ.లక్షా 35 ఐదు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పాచిపెంట మండలం పారమ్మకొండ చెరుకుపల్లి బస్టాప్ వద్ద రహస్య ప్రదేశంలోకి వచ్చి డబ్బు ఇవ్వాలని సూచించారు. అతడు పోలీసులకు సమాచారం అందిచడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షా 50 వేలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
విజయనగరం: రాజులకు శృంగభంగం
సీనియర్లమని గొప్పగా చెప్పుకున్నవారికి... రాజులం మాకు ఇక ఎదురు లేదనుకున్నవారికి... మా మాటే వేదం... మేం చెప్పిందే శాసనం అనుకున్నవారికి... జనాన్ని పట్టించుకోకపోయినా... మా విజయానికి తిరుగులేదని విర్రవీగిన వారికి తాజా ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయి. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని... పదవికోసం గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ ఫలితాలు తెలియజేశాయి. జిల్లాలో రాజులు అనుకున్నవారెవ్వరూ విజయాన్ని అందుకోలేకపోవడం గమనార్హం. సాక్షి, విజయనగరం: మహారాజుకి ఎదురు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితుల్లో అనాదిగా నిరాదరణకు గురవుతున్న ప్రజానీకంలో వచ్చిన చైతన్య దీప్తి ఈ తీర్పు. జిల్లా టీడీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోగా, కనీసం మహారాజులైనా విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడం జిల్లా చరిత్ర తిరగరాసినట్టయింది. జిల్లాలో రాజులందరినీ ఏకం చేశానని... ఇక తమ పార్టీకి ఎదురే లేదని ఆశపడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తీరని నిరాశే ఎదురయింది. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు తన స్థానాన్ని పదిలపర్చుకోలేకపోగా... కనీసం విజయనగరం శాసనసభ్యురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతిని కూడా గెలిపించుకోలేక చతికిల బడ్డారు. ఇక్కడ అశోక్‌పై వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్, అదితి గజపతిపై పోటీచేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిలు విజయం సొంతం చేసుకున్నారు. బొబ్బిలిరాజుల చరిత్రకు చరమగీతం బొబ్బిలి రాజుల హవాకు మరోసారి చెక్ పడిం ది. ఇక్కడ తాము ఏం చెబితే అలా... తాము ఏ పార్టీలో ఉంటే అదే విజయం సాధిస్తుందని మొదటినుంచీ ధీమాగా ఉండేవారు. అదే ఇప్పుడు వారి కొంప ముంచింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికై... స్వప్రయోజనాలకోసం పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి అధిష్టించిన సుజయ్ కృష్ణ రంగారావుకు తగిన శాస్తి జరిగింది. బొబ్బిలిలో సమీప ప్రత్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేని శత్రుచర్ల చినమేరంగి రాజుగా రెండు జిల్లాలకు చిరపరిచితుడై... ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీగా... కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శత్రుచర్ల విజయరామరాజు తన సత్తా నిరూపించుకోలేకపోయారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన సోదరి నరసింహప్రియా థాట్రాజ్ కూడా సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి వారికి సమీప బంధువైన పాముల పుష్పశ్రీవాణి చేతిలో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ సైతం అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓ సామాన్య గిరిజన మహిళ, వైఎస్సార్సీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి చేతిలో ఓటమిపాలయ్యారు. సాలూరులో భంజ్‌దేవ్‌కు భంగపాటు సాలూరు రాజుగా గుర్తింపు పొందిన ఆర్.పి. భంజ్‌దేవ్ ఈసారి మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఒకసారి విజయం సాధించిన ఈయన కుల వివాదంలో చిక్కుకుని ఓటమిపాలయ్యారు. తరువాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి గిరిజనుడిగా ధ్రువపత్రం పొంది పోటీకి దిగినా ఓటమి తప్పలేదు. ఈయన కూడా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేశారని... దేవుని మాన్యాలు సొంతం చేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవే తన ఓటమికి ఒక విధంగా కారణాలయ్యాయి. దోచుకోవడంలో వారు దిట్ట అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్ తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్‌దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్ ఈ ఎన్నికల్లో సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరారు. ఇలాంటి వారి వల్ల జిల్లా ప్రజలకు వరిగేదేమీలేదని గుర్తించిన ప్రజలు తమ ఓటుతో వీరి తరతరాల పెత్తనానికి చరమగీతం పాడారు. -
విజయనగరం: కొత్త చరిత్ర
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లాలో సునామీ సృష్టించింది. అన్ని స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి చరిత్రను తిరగరాసింది. జిల్లా అవిర్భావం తర్వాత ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలవడం ఇది రెండోసారి. 1994 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అప్పటికి ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, పార్వతీపురం పార్లమెంట్ స్థానాలను ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టి జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. 2014 తర్వాత ఆయనపై జిల్లా వాసులు నమ్మకం పెంచుకున్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తానని పదేపదే చెప్పడం.. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేయడంతో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను నమ్మారు. దీనికితోడు గతేడాది ఆగస్టు నుంచి నవంబరు నెల వరకు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో సాలూరు నియోజకవర్గం నుంచి విశాఖ వెళ్లిన జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ కుట్ర నుంచి బయటపడి తిరిగి జిల్లాలో అదే చిరునవ్వుతో పాదయాత్ర చేసిన జగన్ మోహన్‌రెడ్డితో ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళా సంఘాలకు పసుపు కుంకుమ, వృద్ధ్యాప్య, వికలాంగు, వితంతు పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేశారు. అంతకుముందు నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాని ఇవేవీ జగన్ మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయన విశ్వసనీయతను అర్థం చేసుకున్న ఓటర్లు ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం’ అన్న భావనతో పోలింగ కేంద్రానికి వెళ్లడం ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించేందుకు కారణమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్తో మంచి ఫలితాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మేనియాతో పాటు ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ఆ పార్టీకి అద్భుత ఫలితాలు తెచ్చి పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో ఆద్యంతం జాగ్రత్తలు తీసుకుని గెలుపు గుర్రాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. రెండు, మూడు చోట్ల పార్టీ సమన్వయకర్తలను మార్పు చేసి కూడా విజయతీరాలకు చేరే వారిని ఎంపిక చేసుకున్నారు. వారికే టికెట్లు కేటాయించి ఎన్నికల బరిలో దించడంతో సఫలీకృతులయ్యారు. మరోవైపు పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రత్య«ర్థి తెలుగుదేశంపార్టీ నాయకులకు కూడా ఊహకందని విధంగా పోల్మేనేజ్మెంట్ చేశారు. అవతల పక్షం అభ్యర్థులకు సైతం గాలం వేసి ఓట్లు సంపాదించారు. వీటితో పాటు ఎన్నికలకు రెండేళ్లు ముందు బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకుడు వైఎస్సార్సీపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. బొత్స సత్యనారాయణ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ ఎత్తుగడలతో తన మేనల్లుడు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సమన్వయ పటిమతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారంటే అతిశయోక్తి కాదు. -
‘విజయ’తీరాన తు‘ఫ్యాన్’
జిల్లాలో ఫ్యాన్ సృష్టించిన సునామీలో ప్రత్యర్థులు తుడిచిపెట్టుకుపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అటు శాసనసభ, ఇటు పార్లమెంటు స్థానాల్లో ప్రభంజనం సృష్టించారు. ఒక్కస్థానాన్నీ తెలుగుదేశం పార్టీకి దక్కనీయకుండా క్లీన్ స్వీప్ చేశారు. రౌండ్ రౌండ్‌కూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వరుసగా వెలువరించిన ఫలితాలతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు రేకెత్తించా రు. అసలు అభ్యర్థుల ఎంపికతోనే టీడీపీ తప్పటడుగులు వేస్తూ వైఎస్సార్సీపీ విజయానికి పరోక్షంగా దోహదపడగా... పార్టీ అధినేత జగన్ చరిష్మా వారికి అదనపు బలాన్ని అందించినట్టయింది. మొత్తమ్మీద ప్రజలు వైఎస్సార్సీపీవైపే ఉన్నారనీ... జగన్‌పై ఎనలేని అభిమానం చూపారనీ... ఈ ఫలితాలు రుజువు చేశాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. జిల్లా ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున విజయతిలకం దిద్దారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి అడ్రస్ లేకుండా చేశారు. గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీగా అధికారులు ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టంగట్టి తొమ్మిది అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను అందించారు. ఎన్నిక ఏకపక్షం జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే చాలా మెరుగైన ఫలితాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని విజయనగరం లోక్‌సభతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా కురుపాం, సాలూరు, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిపొందింది. పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయనగరం పార్లమెంటు స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించడంతో వైఎస్సార్సీపీ బలం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకు పరిమితమైంది. కానీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగిరేసి సత్తా చూపింది. ఒకేసారి జిల్లాలో వైభవాన్ని కోల్పోయిన తెలుగుదేశంపార్టీ ఒక్కసీటులో కూడా గెలవలేక చతికిలపడిపోయింది. వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో గెలు పొందడం ఒక విశేషమైతే పోటీ చేసిన అన్నిచోట్లా భారీ మెజార్టీ రావడం మరో విశేషం. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం ఫలితాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్‌గజపతిరాజుపై అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు, రాజవంశీకులైన పూసపాటి ఆశోక్‌గజపతిరాజుపై బెల్లాన గెలపొందడంతో తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడినట్టయ్యింది. ⇔ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల శ్రీపుష్పవాణి టీడీపీ అభ్యర్థి నరసింహప్రియా థాట్రాజ్‌పై 27,394 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ పుష్పశ్రీవాణికి 69484ఓట్లు రాగా ఆమె సమీప ప్రత్యర్థికి 44090 ఓట్లు లభించాయి. ⇔ పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అలజంగి జోగారావు 23,814ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 70,626 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చీరంజీవులుకు 49,812 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న నమ్మకం మొదట్నుంచీ ఉన్నా భారీ స్థాయిలో మెజార్టీ రావడం విశేషం. ⇔ బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు 75,332ఓట్లు రాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడుకు 83,678ఓట్లు రావడంతో 8346 మెజార్టీ లభించింది. ఇక్కడ మంత్రిపై పోటీ చేసి గెలుపొందడం గ్రాండ్ విక్టరీగా చెప్పుకోవాలి. ఆరంభంలో విజయావకాశాలు టీడీపీకి ఉన్నట్లు కనిపించినా పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ ఈ సీటును సొంతం చేసుకుంది. ⇔ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మొత్తం 29,051ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 94,258 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, కాకలు తీరిన రాజకీయయోధుడు, సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడుకు 66,207 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉంది. ⇔ విజయనగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 78,849ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆదితిగజపతిరాజుకు 72,432 ఓట్లు వచ్చాయి. కోలగట్ల 6417ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొదటి నుంచి పోటీ తీవ్రంగా ఉంటుందన్న చర్చ జరిగింది. అనుకున్నట్లే ఉత్కంఠ నడుమ అంతిమంగా వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ⇔ సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి పీడక రాజన్నదొర 19,500ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 73,291ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఆర్.పి.భంజ్‌దేవ్‌కు 53,791 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గెలుస్తామని టీడీపీ గట్టి నమ్మకంతో ఉండగా భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధించడం విశేషం. రాజన్నదొర నాలుగోసారి గెలిచి తనకు ఎదురులేదని మరోసారి నిరూపించారు. ⇔ శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 89,653 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి 78,097ఓట్లు లభించాయి. కడుబండి 11,556 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గెలుపుపై ఎటువంటి అం చనాలు లేకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి బరిలో దిగినా పోలింగు రోజు నాటికి అనూహ్యంగా పుం జుకుని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ⇔ చీపురుపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 87,508 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు 61,671 ఓట్లు లభించాయి. బొత్స సత్యనారాయణ 26,498 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అందరూ ఉహించినట్లే బొత్సకు భారీ మెజార్టీ లభించింది. ⇔ గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యకు 26,910 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈయనకు 92,863 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి కె.ఎ.నాయుడుకు 65,953ఓట్లు లభించాయి. ఇక్కడ భారీ మెజార్టీ వస్తుందని, గెలుపు లాంఛనమే అని ముందే ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. -
రంజాన్ సుఖ సంతోషాలు నింపాలి
కురుపాం : సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులంతా బాగుండాలని, రంజాన్ ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. కురుపాంలోని శివ్వన్నపేటలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సహపంక్తిలో కూర్చొని ఫలాహారాన్ని స్వీకరించి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా రంజాన్ పండగ సరదాగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు ఐక్యంగా కలసిమెలసి ఉంటూ ఆనందాల నడుమ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలు ఐక్యతను చాటడం ద్వారా మరింతగా ఎదగాలని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, గోరిశెట్టి గిరిబాబు, జి.వి.శ్రీనువాసరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్ గౌరీశంకరరావుతో పాటు కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నెలాఖరులోగా పనులు పూర్తి
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు 90 శాతం, శాఖపరమైన నిధులు పది శాతంతో గ్రామాల్లో చేపడుతున్న సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, గృహనిర్మాణాలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులంతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆయా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించినందునా సంబంధిత శాఖ అధికారులు ఈ నెలాఖరుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
ఏమి సేతుర లింగా..!
రోజుకో నిర్ణయం.. పూటకో ప్రకటనతో డీఎస్సీ అభ్యర్థులను ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రక్రియ పూర్తయే వరకూ నమ్మకం కుదరక అభ్యర్థులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన పరిణామాలు రోజుకో విధంగా మారుతుండడమే. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి జిల్లాలో 520 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ లెక్కలు తూచ్ అంటూ 319 పోస్టులకు కుదించింది. అంతేకాకుండా జిల్లాలో విద్యాశాఖ తాజాగా చేపట్టిన టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి నివేదికల తయారీ ప్రక్రియ అభ్యర్థులను అయోమయంలోకి నెట్టేస్తోంది. విజయనగరం అర్బన్: ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 20వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 319 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తొలుత 25 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోగా చివరి తేదీ నాటికి 23 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో మిగిలారు. వీరంతా కొన్ని నెలలుగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే పనిలో భాగంగా కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి పేరుతో ప్రభుత్వం కొత్త ఉపాధ్యాయ నియామకాలకు మంగళం పాడే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో డీఎస్సీ అభ్యర్థులు గుటకలు మింగలేకపోతున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తిని మించి టీచర్ల సంఖ్య ఎక్కువ ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సిసోడియా ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తాజా నివేదికను విద్యాశాఖ ఆగమేఘాలపై తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంఈఓలు ఇప్పటికే పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను సేకరిస్తున్నారు. టీచర్ల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియతో కొత్త ఉపాధ్యాయ నియామకాల్లో కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ చర్యల ద్వారా అర్థమవుతోంది. గత ఏడాది అక్టోబర్ నాటికి చూపిన యూ-డైస్ నివేదిక ఆధారంగా జిల్లాలో 319 పోస్టుల వరకు ఖాళీలను భర్తీ చేయొచ్చని ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే తాజాగా విద్యార్థి ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన తరువాత డబుల్ ఎంట్రీలను తీసివేసిన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి భారీగా తగ్గిపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయవర్గాలే చెబుతున్నాయి. నోటిఫికేషన్‌లోని అన్ని పోస్టులూ అవసరం కాకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ రద్దుచేయలేని పరిస్థితి ఉంది కాబట్టి డీఎస్సీ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశమున్నట్లు అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 9 నుంచి 10 తరగతి వరకు 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. దీనిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతమున్న టీచర్లనే సర్దుబాబు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రభుతానికి సూచించినట్లు సమా చారం. జిల్లాలో 2,931 పాఠశాలలుండగా 10 వేలమంది ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలల్లో 3,41,120 మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన 34 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిబంధనల మేరకు ఈ నిష్పత్తి సరిపోతుంది. మరోవైపు వయోపరిమితి పెంచడం వల్ల మరో రెండేళ్ల వరకు ఖాళీలు ఏర్పడే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే గణాంకాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని, తీరా నోటిఫికేషన్ విడుదల చేశాక రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టడం అన్యాయమని అభ్యర్థులు వాపోతున్నారు. ఆది నుంచీ గందరగోళమే డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం ఆది నుంచీ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తూనే ఉంది. ఐదుసార్లు ఊరించి చివరికి నోటిఫికేషన్ జారీచేసింది. అయితే అందులో కూడా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, అటు టెట్, డీఎస్సీని అనుసంధానించడం, డీఈడీలు, బీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతోంది. -
అందని ఆరోగ్యశ్రీ
విజయనగరం ఆరోగ్యం: ఎద్దు పుండు కాకికి ఏం నొప్పి అన్నట్లు తయారైంది ఆరోగ్యశ్రీ రోగుల విషయంలో ప్రభుత్వం పరిస్థితి. బెనిఫిషరీకాపీలు లేకపోవడంవల్ల 15 రోజులుగా రోగులకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో అనేకమంది రోగులు అవస్థలు పడుతున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విశేషం. రచ్చబండకార్డులు, కార్డుల్లో పేర్లులేని పిల్లలకు బెనిఫిషరీ కాపీ ఉంటేనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రచ్చబండ కార్డులు ఉన్న వారు, రేషన్‌కార్డుల్లో పేర్లు లేని వారు ఆరోగ్యశ్రీసేవలు పొందడానికి ఆరోగ్యశ్రీ విభాగం ఇచ్చే బెనిఫిషరీ కాపీపై చికిత్స అవసరమైన రోగితోపాటు కుటుంబసభ్యుల గ్రూప్ ఫొటో అతికించి రేషన్ కార్డు ఒరిజనల్‌దేనని ఫొటోపై తహశీల్దార్ సంతకం చేయాలి. ఆ తర్వాత కలెక్టరేట్‌కు వెళ్తే కలెక్టర్ దానిపై సంతకం చేస్తారు. కలెక్టర్ సంతకం చేసిన బెనిఫిషరీ కాపీని పట్టుకుని వెళ్తే సంబంధిత ఆస్పత్రుల్లో రోగికి సేవలు అందిస్తారు. అయితే బెనిఫిషరీ కాపీలకు సంబంధించిన బుక్స్ అయిపోవడంతో రోగులకు వైద్యసేవలు నిలిచిపోయాయి. కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులు బెనిఫిషరీ కాపీల కోసం అనేకమంది రోగుల కుటుంబసభ్యులు పక్షం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పలితం లేకుండా పోతోంది. బెనిఫిషరీ కాపీలు పంపించాలని ఆరోగ్యశ్రీ అధికారులు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇంతవరకు సరఫరా జరగలేదు. సత్వర చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గరికిపాటి ఉషశ్రీ వద్ద సాక్షి ప్రస్తావించగా బెనిఫిషరీ కాపీలు లేని మాటవాస్తవమేనని, ఈవిషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈఓ దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. -
పల్లెపై పన్నుల పిడుగు
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె నెత్తిన పన్నుల భారం మోపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్లో ఉన్నామని చెబుతూ పల్లె ప్రజలపై పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం చట్టాలను వెలికితీసింది. 1994 సంవత్సరంలో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో 44 రకాల పన్నుల విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తరహా విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక మాడ్యుల్‌ను ఏర్పాటు చేసింది. ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ఏర్పాటు చేసిన మాడ్యూల్‌ను ఇంటెర్నెట్‌కు అనుసంధానం చేయటం ద్వారా ఆయా గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల పన్నులు వసూలు అవుతున్నదీ, లేనిదీ పర్యవేక్షించాలని పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఇక 44 రకాల పన్నుల వసూలు జిల్లా వ్యాప్తంగా 921 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి ద్వారా ఇప్పటి వరకు ఆస్తి, నీటి, భూక్రయవిక్రయాలు, దుఖాణాల లీజులు తదితర 10 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో ఏడాదికి సుమారు రూ 4 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. తాజాగా నిర్ణయం మేరకు మొత్తం 44 రకాల పన్నులు వసూలు చేయనున్నారు. పల్లెలపై ఈ భారం మరో రూ.2 కోట్ల నుంచి రూ4 కోట్ల వరకూ పడే అవకాశం ఉంటుంది. సంతలు, సెల్టవర్ల లెసైన్స్ పన్ను, ప్రకటనల పన్నుతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పన్ను, వీధి దీపాల పన్ను ఇలా ప్రతి అవసరంపై పన్ను విధించి పల్లె ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. ఆన్లైన్లో పర్యవేక్షణ పన్నుల వసూలు ప్రక్రియ పక్కాగా నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలుపై పర్యవేక్షణ చేసేందుకు ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ను రూపొందించారు. ఈ విధానం ద్వారా ఏఏ పంచాయతీల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వసూలు జరగడం లేదు..? అన్న విషయాలను ఆన్లైన్లోనే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏ పంచాయతీలోనైనా పన్నుల వసూలు జరగని పక్షంలో నేరుగా ఉన్నతాధికారులే సంబంధిత పంచాయతీ కార్యదర్శితో , ఆ ఉద్యోగి లేని పక్షంలో జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, ఈఓపీఆర్డీలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు నూతనంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై శుక్రవారం జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి జి.రాజకుమారి డివిజనల్ పంచాయతీ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. ఇకపై అన్ని పంచాయతీల్లో 44 రకాల పన్నులు విధించే విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. -
బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు: పరకాల
విశాఖ: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ఓ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. విశాఖలో ఈ రోజు రాత్రికి కొంత మేరకు విద్యుత్ ను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. తుఫాను నష్టంపై అంచనాకు ఇంకా రాలేదని ఆయన ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. తుఫాన్ లో మొత్తం 21 మంది చనిపోయారని, మృతుల్లో చాలా మంది వృక్షాలు విరిగి మీదపడటంతోనే మరణించారని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని పరకాల ప్రభాకర్ వెల్లడించారు.