విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె నెత్తిన పన్నుల భారం మోపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్‌లో ఉన్నామని చెబుతూ పల్లె ప్రజలపై పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం చట్టాలను వెలికితీసింది. 1994 సంవత్సరంలో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో 44 రకాల పన్నుల విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తరహా విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక మాడ్యుల్‌ను ఏర్పాటు చేసింది.
ర్యాపిడ్ అసెస్‌మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ఏర్పాటు చేసిన మాడ్యూల్‌ను ఇంటెర్నెట్‌కు అనుసంధానం చేయటం ద్వారా ఆయా గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల పన్నులు వసూలు అవుతున్నదీ, లేనిదీ పర్యవేక్షించాలని పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు.
ఇక 44 రకాల పన్నుల వసూలు
జిల్లా వ్యాప్తంగా 921 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి ద్వారా ఇప్పటి వరకు ఆస్తి, నీటి, భూక్రయవిక్రయాలు, దుఖాణాల లీజులు తదితర 10 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో ఏడాదికి సుమారు రూ 4 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. తాజాగా నిర్ణయం మేరకు మొత్తం 44 రకాల పన్నులు వసూలు చేయనున్నారు. పల్లెలపై ఈ భారం మరో రూ.2 కోట్ల నుంచి రూ4 కోట్ల వరకూ పడే అవకాశం ఉంటుంది. సంతలు, సెల్‌టవర్‌ల లెసైన్స్ పన్ను, ప్రకటనల పన్నుతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పన్ను, వీధి దీపాల పన్ను ఇలా ప్రతి అవసరంపై పన్ను విధించి పల్లె ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ
పన్నుల వసూలు ప్రక్రియ పక్కాగా నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలుపై పర్యవేక్షణ చేసేందుకు ర్యాపిడ్ అసెస్‌మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ను రూపొందించారు. ఈ విధానం ద్వారా ఏఏ పంచాయతీల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వసూలు జరగడం లేదు..? అన్న విషయాలను ఆన్‌లైన్‌లోనే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏ పంచాయతీలోనైనా పన్నుల వసూలు జరగని పక్షంలో నేరుగా ఉన్నతాధికారులే సంబంధిత పంచాయతీ కార్యదర్శితో , ఆ ఉద్యోగి లేని పక్షంలో జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, ఈఓపీఆర్‌డీలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు నూతనంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి జి.రాజకుమారి డివిజనల్ పంచాయతీ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, ఈఓపీఆర్‌డీలతో సమావేశం నిర్వహించారు. ఇకపై అన్ని పంచాయతీల్లో 44 రకాల పన్నులు విధించే విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
పల్లెపై పన్నుల పిడుగు
Published Sat, Feb 14 2015 3:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement