రోజుకో నిర్ణయం.. పూటకో ప్రకటనతో డీఎస్సీ అభ్యర్థులను ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రక్రియ పూర్తయే వరకూ నమ్మకం కుదరక అభ్యర్థులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన పరిణామాలు రోజుకో విధంగా మారుతుండడమే. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి జిల్లాలో 520 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ లెక్కలు తూచ్ అంటూ 319 పోస్టులకు కుదించింది. అంతేకాకుండా జిల్లాలో విద్యాశాఖ తాజాగా చేపట్టిన టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి నివేదికల తయారీ ప్రక్రియ అభ్యర్థులను అయోమయంలోకి నెట్టేస్తోంది.
విజయనగరం అర్బన్: ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 20వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 319 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తొలుత 25 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్‌లైన్ చేసుకోగా చివరి తేదీ నాటికి 23 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో మిగిలారు. వీరంతా కొన్ని నెలలుగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే పనిలో భాగంగా కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి పేరుతో ప్రభుత్వం కొత్త ఉపాధ్యాయ నియామకాలకు మంగళం పాడే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో డీఎస్సీ అభ్యర్థులు గుటకలు మింగలేకపోతున్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తిని మించి టీచర్ల సంఖ్య ఎక్కువ ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సిసోడియా ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తాజా నివేదికను విద్యాశాఖ ఆగమేఘాలపై తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంఈఓలు ఇప్పటికే పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను సేకరిస్తున్నారు. టీచర్ల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియతో కొత్త ఉపాధ్యాయ నియామకాల్లో కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ చర్యల ద్వారా అర్థమవుతోంది. గత ఏడాది అక్టోబర్ నాటికి చూపిన యూ-డైస్ నివేదిక ఆధారంగా జిల్లాలో 319 పోస్టుల వరకు ఖాళీలను భర్తీ చేయొచ్చని ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే తాజాగా విద్యార్థి ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన తరువాత డబుల్ ఎంట్రీలను తీసివేసిన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి భారీగా తగ్గిపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయవర్గాలే చెబుతున్నాయి. నోటిఫికేషన్‌లోని అన్ని పోస్టులూ అవసరం కాకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ రద్దుచేయలేని పరిస్థితి ఉంది కాబట్టి డీఎస్సీ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశమున్నట్లు అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 9 నుంచి 10 తరగతి వరకు 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. దీనిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతమున్న టీచర్లనే సర్దుబాబు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రభుతానికి సూచించినట్లు సమా చారం. జిల్లాలో 2,931 పాఠశాలలుండగా 10 వేలమంది ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలల్లో 3,41,120 మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన 34 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిబంధనల మేరకు ఈ నిష్పత్తి సరిపోతుంది. మరోవైపు వయోపరిమితి పెంచడం వల్ల మరో రెండేళ్ల వరకు ఖాళీలు ఏర్పడే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే గణాంకాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని, తీరా నోటిఫికేషన్ విడుదల చేశాక రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టడం అన్యాయమని అభ్యర్థులు వాపోతున్నారు.
ఆది నుంచీ గందరగోళమే
డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం ఆది నుంచీ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తూనే ఉంది. ఐదుసార్లు ఊరించి చివరికి నోటిఫికేషన్ జారీచేసింది. అయితే అందులో కూడా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, అటు టెట్, డీఎస్సీని అనుసంధానించడం, డీఈడీలు, బీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతోంది.
ఏమి సేతుర లింగా..!
Published Mon, Feb 23 2015 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement