
సాక్షి, విజయనగరం: ప్రజా చైతన్యం ఉండబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక ప్రజా చైతన్య యాత్ర దేని కోసం నిర్వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామీ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ హోం మంత్రి చిన రాజప్ప లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ పర్యటన జయప్రదంగా ముగిసిందని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగలేదన్నారు. ఉగాది రోజున ఇల్లు లేని వాళ్లందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, కుల, మతాలు చూడకుండా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. పాలనలో దేశంలోనే ఆదర్శ సీఎం జగన్ అన్నారు. అర్హత కలిగిన వాళ్లందరికి పెన్షన్లు పునరుద్ధరణ చేశామని ఆయన తెలిపారు.
మద్య నిషేధ అమలులో భాగంగా బెల్ట్ షాప్‌లను లేకుండా చేశామని తెలిపారు. ఆనాడు మద్యం సిండికేట్‌లో ప్రతికపక్ష నాయకులను అరెస్టు చేయిస్తామని చంద్రబాబు బెదిరించారన్నారు. మూడు రాజధానులు కొత్తేమీ కాదని, ఆనాడు మద్రాస్ నుంచి కర్నూలుకి మర్చలేదా, హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చలేదా అని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో పారిశ్రామిక వేత్తల సదస్సును అమరావతిలో కాకుండా.. విశాఖలో ఎందుకు పెట్టారని, అక్కడ అభివృద్ధి ఏమి లేదని అందరికి తెలిసిపోతుందనా? అని ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్లనే బాబుని ప్రజలు ఇంటికి పంపించారని విమర్శించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్రకి ప్రజలు ఎవరూ రారని, మద్దతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు.