18, 19 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ/రూరల్: జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో ప్రచారం చేసుకుని అధికారం వచ్చాక.. తన కొడుక్కి మంత్రి ఉద్యోగం ఇప్పించుకుని నిరుద్యోగ యువతను నడిరోడ్డున పడేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తారో? సంక్షేమ రాజ్యం అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. వార్డు ఇన్‌చార్జి ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 18వ వార్డు లంకవీధి, 19వ వార్డు జొన్నగుడ్డి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జొన్నగుడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు అయిదేళ్ల పాటు దోచుకున్న డబ్బుతో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నిస్తారని, వాటికి లొంగకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పాలనను గెలిపించుకోవాలని కోరారు.
బాబును నమ్మి మోసపోవద్దు
బాబు మోసపూరిత హామీ రుణమాఫీ పథకం వట్టి మాయేనని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఘనుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మండల పరిధిలోని కోరుకొండపాలెం గ్రామంలో తన తండ్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ 2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు వాటిని విస్మరించి మహిళలు, రైతులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు హామిని గాలికొదిలేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వృద్ధులకు పింఛను రూ.2 వేలు చేస్తానంటే.. కాపీ కొట్టి రెండు నెలలుగా అందిస్తున్నాడన్నారు. మహిళలకు ఇస్తున్న పసుపు–కుంకుమ పచ్చి దగా అని మండిపడ్డారు. అయిదేళ్లుగా వడ్డీలేని రుణం ఇవ్వకుండా, వారు కట్టిన వడ్డీ డబ్బులే పసుపు– కుంకుమ కింద అందిస్తున్నాడన్నారు.
చంద్రబాబు 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మరోసారి మోసపూరిత హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్నా మహిళలు ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 2004లో నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎంతో అభివద్ధి చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి, రాజన్న రాజ్యం వచ్చేందుకు మహిళలంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించండి
విజయనగరం నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే కోలగట్ల వీరభద్రస్వామికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన భార్య, మున్సిపల్ కౌన్సిలర్ కోలగట్ల వెంకటరమణి అభ్యర్థించారు. కోలగట్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం 2వ వార్డులోని కొత్తపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలన్నారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment