
కొత్తపేట ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బెల్లాన చంద్రశేఖర్, కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఆరవ వార్డులో సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. కొత్తపేట శుద్ధ వీధి ప్రాంతానికి వారు చేరుకోగానే ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా జై జగన్, జై బెల్లాన, జై కోలగట్ల నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి. ఆరో వార్డు పరిధిలో సుద్ద వీధి, పులిగడ్డ వారి వీధి, పద్మశాలి వీధి, కొత్తపేట, కుమ్మరి వీధి, కూరెళ్ళ వారి వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని, ఐదేళ్ల పాలనపై విసిగి వేసారి పోయారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తమ ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఓటు వేసే ప్రజలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. తెలుగుదేశం పాలనలో లంచగొండితనం పేరుకుపోయిన ప్రస్తుత తరుణంలో రాజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రచార కార్యక్రమంలో బెల్లాన, కోలగట్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.