రాజరికమా.. జనహితమా.! | Kolagatla Veerabhadra Swamy VS Athidi Vijayalaxmi Gajapathi Raju | Sakshi
Sakshi News home page

రాజరికమా.. జనహితమా.!

Published Fri, Mar 22 2019 10:44 AM | Last Updated on Fri, Mar 22 2019 10:46 AM

 Kolagatla Veerabhadra Swamy VS Athidi Vijayalaxmi Gajapathi Raju - Sakshi

విజయనగరం నియోజకవర్గ ముఖచిత్రం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తరతరాల రాజరిక వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఒకవైపు.. గెలుపోటములతో ప్రమేయం లేకుండా ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మరో వైపు ఈ ఎన్నికల్లో విజయనగరం నుంచి తలపడుతున్నారు. కేంద్రమంత్రిగా, ఎంపీగా ఉంటూ నియోజకవర్గ ప్రజలను, జిల్లా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని అశోక్‌గజపతిరాజు తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా తీసుకురావడం కోసం జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారు. చెమట విలువేంటో, పేదవాళ్ల బాధలెలా ఉంటాయో కూడా కనీస అవగాహన లేని తన కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయించి నియోజకవర్గ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు.


ఆది నుంచీ రాజరికమే..
ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంగా ఉన్న సమయంలో 1953లో విజయనగరం నియోజకవర్గం రూపాంతరం చెందింది.  మొదటి సారిగా నిర్వహించిన ఎన్నికల్లో  ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడేళ్ల వ్యవధిలో 1955లో  నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతోంది.

అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు, పి.అశోక్‌గజపతిరాజులు ఎక్కువసార్లు గెలుపొందినప్పటికీ.. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపించలేదు. దాని ఫలితమే ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పేరును ప్రతి ఎన్నికలకు ముందుగానే ఖరారు చేస్తుండగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని నిన్నటి వరకూ ప్రకటించలేకపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని తన కుమార్తె అధితి గజపతికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించుకునేందుకు ఎంపీ అశోక్‌గజపతిరాజు ప్రయత్నించడం వల్ల ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోయారు. ఎట్టకేలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీకూతుళ్లే టికెట్లు సాధించుకున్నారు.


అధితికీ అన్నీ ప్రతికూలతలే..
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న అశోక్‌ గజపతిరాజు విజయనగరం నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌ మిల్లులు మూతపడి సుమారు 12 వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో  మెడికల్‌ కళాశాలలున్నా విజయనగరంలో మాత్రం ఏర్పాటు కాలేదు. ఎన్నికలొస్తునాయని ఇటీవలే మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 3 లక్షలకు పైగా జనాభా కలిగిన విజయనగరం పట్టణ వాసులకు తాగు నీటి సమస్య వేధిస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణ వాసులుకు 36 ఎంఎల్‌డీ నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా.. ఆ స్థాయిలో వనరులను పెంపొందించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. 2015 జూలై నెలలో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ అధితికి ప్రతికూలతలుగా మారనుండగా... ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రాలు కానున్నాయి. కేవలం టీడీపీకి, తన తండ్రి అశోక్‌కు ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే అధితి ఆధారపడాల్సి వస్తోంది.


చరిత్రను తిరగరాయగల కోలగట్ల..
 పాదయాత్ర సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా  పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ అయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నిజానికి పూసపాటి వంశీకుల కంచుకోటగా పేరొందిన విజయనగరం నియోజకవర్గంలో ఆ వంశానికి చెందిన వారే అత్యధిక సార్లు ఎన్నికల్లో గెలిచారు. అయితే రాజ వంశీకులపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి  కోలగట్ల వీరభద్రస్వామి  ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా 2004లో చారిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకుని చరిత్రను తిరగరాశారు.

ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం అవుతుందనే ధీమాతో కోలగట్ల ఉన్నారు. అంతేకాకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా కోలగట్ల నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే పలుకుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అత్యవసర వైద్యం, రక్తం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇవన్నీ ఆయనకు అనుకూలతలుగా మారనున్నాయి.

మొత్తం ఓటర్లు  2,10,695
పురుషులు    1,03,669
స్త్రీలు 1,07,026
ఇతరులు   27 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement