విజయనగరం ఆరోగ్యం: ఎద్దు పుండు కాకికి ఏం నొప్పి అన్నట్లు తయారైంది ఆరోగ్యశ్రీ రోగుల విషయంలో ప్రభుత్వం పరిస్థితి. బెనిఫిషరీకాపీలు లేకపోవడంవల్ల 15 రోజులుగా రోగులకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో అనేకమంది రోగులు అవస్థలు పడుతున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విశేషం.
రచ్చబండకార్డులు, కార్డుల్లో పేర్లులేని పిల్లలకు బెనిఫిషరీ కాపీ ఉంటేనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రచ్చబండ కార్డులు ఉన్న వారు, రేషన్‌కార్డుల్లో పేర్లు లేని వారు ఆరోగ్యశ్రీసేవలు పొందడానికి ఆరోగ్యశ్రీ విభాగం ఇచ్చే బెనిఫిషరీ కాపీపై చికిత్స అవసరమైన రోగితోపాటు కుటుంబసభ్యుల గ్రూప్ ఫొటో అతికించి రేషన్ కార్డు ఒరిజనల్‌దేనని ఫొటోపై తహశీల్దార్ సంతకం చేయాలి. ఆ తర్వాత కలెక్టరేట్‌కు వెళ్తే కలెక్టర్ దానిపై సంతకం చేస్తారు. కలెక్టర్ సంతకం చేసిన బెనిఫిషరీ కాపీని పట్టుకుని వెళ్తే సంబంధిత ఆస్పత్రుల్లో రోగికి సేవలు అందిస్తారు. అయితే బెనిఫిషరీ కాపీలకు సంబంధించిన బుక్స్ అయిపోవడంతో రోగులకు వైద్యసేవలు నిలిచిపోయాయి.
కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులు
బెనిఫిషరీ కాపీల కోసం అనేకమంది రోగుల కుటుంబసభ్యులు పక్షం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పలితం లేకుండా పోతోంది. బెనిఫిషరీ కాపీలు పంపించాలని ఆరోగ్యశ్రీ అధికారులు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇంతవరకు సరఫరా జరగలేదు. సత్వర చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గరికిపాటి ఉషశ్రీ వద్ద సాక్షి ప్రస్తావించగా బెనిఫిషరీ కాపీలు లేని మాటవాస్తవమేనని, ఈవిషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈఓ దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు.
అందని ఆరోగ్యశ్రీ
Published Mon, Feb 23 2015 3:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement