సాక్షి, విజయనగరం: జిల్లాలోని సాలూరు నియోజకవర్గ గిరిజన ఏజెన్సీ గ్రామాల్లో నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ నలుగురు నకిలీ మావోయిస్టులను సాలూరు పోలీసులు పట్టుకున్నారు. సాలూరు సర్కిల్ పరిధిలో పోలీసులు ఒక బృందంగా ఏర్పడి పకడ్బంది వ్యూహంతో మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది కాలంగా నలుగురు వ్యక్తులు తాగుడు, చెడు వ్యసనాలకు బానిసై.. గ్రామాల్లో డబ్బు పలుకుబడి ఉన్న వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. వీళ్లు గత రెండు నెలలుగా చిట్టినాయుడు, ఎల్‌ఐసీ ఏజెంట్ గౌరినాయుడిని బెదిరించి వారి నుంచి సుమారు ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు.
రెండు రోజుల నుంచి చెముడు గ్రామానికి చెందిన రామానాయుడు అనే వ్యక్తికి కూడా ఫోన్ కాల్స్ చేస్తూ.. తాము నక్సలైట్లమంటూ డబ్బులు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే అంతు తేలుస్తాం అంటూ బెదిరించారు. రామానాయుడు ముందస్తుగా రూ.లక్షా 35 ఐదు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పాచిపెంట మండలం పారమ్మకొండ చెరుకుపల్లి బస్టాప్ వద్ద రహస్య ప్రదేశంలోకి వచ్చి డబ్బు ఇవ్వాలని సూచించారు. అతడు పోలీసులకు సమాచారం అందిచడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షా 50 వేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment