ఆరోపణలు రుజువు చేస్తారా?
గాలి ముద్దుకృష్ణమ ఇంటి ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన
చెవిరెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు
సాక్షి, తిరుపతి : తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఇంటి ఎదుట గురువారం వైఎస్సార్‌సీపీ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వర్గీయులతో ధర్నాకు యత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ పేరుతో చెవిరెడ్డి విరాళాలు సేకరించారని, తుమ్మలగుంటలో ఆలయం నిర్మించారని ఆరోపణలు చేశారు. దీంతో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ గురువారం చెవిరెడ్డి తన వర్గీయులతో తిరుచానూరు రోడ్డులో ఉన్న ముద్దుకృష్ణమ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు వెళ్లారు. అయితే, అప్పటికే పెద్ద ఎత్తున అక్కడ గుమికూడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెవిరెడ్డి వర్గీయులను అడ్డుకుని దాడికి యత్నించారు. టీడీపీ నాయకులను పక్కకు నెట్టివేసిన పోలీసులు చెవిరెడ్డితో సహా వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేసి బలవంతంగా జీపు ఎక్కించారు.
దేనికైనా సిద్ధం : చెవిరెడ్డి
తాను అవినీతికి పాల్పడినట్లు ముద్దుకృష్ణమనాయుడు రుజువు చేస్తే, దేనికైనా సిద్ధమేనని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువులో ఒక్క సెంటు ఆక్రమించానని తేలినా, అక్కడ ఆలయానికి ఒక్క రూపాయి విరాళం ఇచ్చినట్లు నిరూపించినా, ఎలాంటి శిక్ష విధించినా సిద్ధంగా ఉంటానన్నారు. ఆధారాలతో నిరూపించకపోతే, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించిన గాలికి బెంగళూరులో 25 ఎకరాల ఫామ్ హౌస్, హైదరాబాద్‌లో మూడు బంగళాలు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని సవాల్ విసిరారు.