బలపడదాం.. పోరాడదాం
శ్రీకాకుళం: సంస్థాగతంగా బలపడితేనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమర్థవంతంగా పోరాడగలుగుతామని వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జి, బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి జనాభిమానం మెండుగా ఉన్నా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం సంస్థాగతంగా బలహీనంగా ఉండడమేనని చెప్పా రు. దానికి తోడు ధీమా కూడా ఓ కారణమన్నారు. సమిష్టిగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించాలని నాయకులను కోరారు. కమిటీలను నాలుగు గోడల మధ్య నియమించకుండా మండలస్థాయికి వెళ్లి సమవేశాన్ని ఏర్పాటు చేయాలని జగన్‌మోహనరెడ్డి ఆదేశించారని, ఆ విధంగానే కమిటీల నియామకం ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షురాలికి సహకరించాలని సూచించారు.
ప్రతిపక్ష పాత్రే కీలకం:ధర్మాన
మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే రెండు పక్షాలు ఉంటాయని.. ప్రతిపక్ష పాత్ర నిర్వహణే కష్టమైన పని అని అన్నారు. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తే ఆ తర్వాత అధికారం మనదేనన్నారు. ఎప్పుడైనా ప్రతిపక్షం పైకి వెళ్తుంటే అధికార పక్షం కిందకు దిగుతుందని వివరించారు. ప్రభుత్వం చేసేవన్నీ అక్రమాలేనని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజల పక్షాన పోరాడుతూ అందరికీ అర్ధమయ్యేలా పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంపై విమర్శలు మానుకొని జిల్లా అభివృద్ధిపై.. పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. కమిటీల నియామకం విషయంలో స్థానిక నాయకులంతా ఓ చోట చేరి ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకుని అధ్యక్షురాలికి సహకరించాలన్నారు.
అబద్ధాలు చెప్పలేకే ప్రతిపక్షంలో..: సీతారాం
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రతిపక్షం సమర్థవంతంగా పని చేయకుంటే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారని హెచ్చరిం చారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేకే జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిం దని.. నిజాయితీ అంటే ఇదేనన్నారు. పలువురు మంత్రులు జయలలితపై ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ దీనికి పదిరెట్లు ఎక్కువ శిక్ష జగన్‌కు పడుతుందని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే చంద్రబాబుపై ఉన్న పలు కేసులకు సంబంధించి తెచ్చుకున్న స్టేలను తొలగించుకుని విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరికి ఏ శిక్ష ఎంత పడుతుందో తెలుస్తుందన్నారు.
చంద్రబాబు పరాన్నభుక్కు:కృష్ణదాస్
పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ స్వతహాగా అధికారంలోకి రాలేదని, తొలుత మామకు వెన్నుపోటు పొడిచి, రెండోసారి వాజ్‌పేయిని చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు మోడీ బొమ్మను చూపించి, అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.
ప్రజల పక్షాన పోరాడదాం:రెడ్డి శాంతి
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు చేయాలని కోరారు. పేదల పక్షాన పోరుడుతూ ప్రజల మధ్యన ఉందామని, మండలస్థాయికి వచ్చినప్పుడు తనకు సహకరించాలని కోరారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెబుతూ సభ్యులు ఎంతమంది ఉండాలన్నది నిర్దేశించారు. పార్టీని పటిష్టం చేసి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండి, 2019 ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రిని చేద్దామన్నారు.
త్యాగాలకు సిద్ధం కావాలి:పాలవలస
పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ హామీలకు విరుద్ధంగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ప్రజల తరపున శాసనసభలో పోరాటం చేస్తామన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మట్లాడుతూ చంద్రబాబు సంతకానికి విలువ లేదని ఆయన పెట్టిన సంతకాలన్నీ కమిటీల నియామకాలపైనేనని ఎద్దేవా చేశారు. సమావేశానికి ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సమావేశంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్షి, పార్టీ సమ్వయకర్తలు నర్తు రామారావు, జుత్తు జగన్నాయకులు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, ఇతర ముఖ్య నాయకులు పిరియా సాయిరాజ్, మీసాల నీలకంఠంనాయుడు, ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, విజయనగరం జిల్లా నాయకులు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.ప్రసాద్ తదితరులుగా ప్రసంగించగా.. పాలవలస విక్రాంత్, అంధవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి, అంధవరపు వరహానర్సింహం, పాలవలస ఇందుమతి, దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, చిట్టి జనార్ధన్, చల్లా అలివేలు మంగ, శిమ్మ రాజశేఖర్, కెఎల్ ప్రసాద్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, పేరాడ తిలక్, మూకళ్ల సుగుణ, మామిడి శ్రీకాంత్, గొండు కృష్ణ, రొక్కం సూర్యప్రకాశరావు, టి. కామేశ్వరి, బిడ్డిక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.