ఖబడ్దార్!
రైతు, డ్వాక్రా రుణమాఫీకి షరతులొద్దు
హామీ మేరకు పూర్తిస్థాయిలో రద్దు చేయాలి
ఎన్నికల హామీలు అమలయ్యేవరకు నిత్య పోరాటాలే
ధర్నాలో వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరిక
విజయవాడ : ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు ఎలాంటి షరతులూ లేకుండా.. పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పార్థసారథి మాట్లాడుతూ రైతులు, మహిళల కంట కన్నీరు కార్చేలా వ్యవహరిస్తే ప్రభుత్వ నాశనమవుతుందన్నారు. రుణమాఫీ సక్రమంగా చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ నాయకులు సిగ్గుపడాల్సిందిపోయి స్వీట్లు పంచుకోవడం విడ్డూరంగాఉందని చెప్పారు. అధికారంలోకొచ్చి ఆరునెలలు అవుతున్నా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 20 శాతం మొదటి విడతగా జమ చేస్తామని, రైతు పేరున బాండ్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంట సాగు కోసం రైతులు రుణాలు తీసుకుంటే.. వారి ఆధార్, రేషన్ కార్డులు ఇతర వివరాలు సేకరించి టీడీపీ ప్రభుత్వం అన్నదాతలను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు.
దాళ్వా నీటిపై నేటికీ స్పష్టత లేదు.: జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి దాళ్వా పంటకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారో ఇంతవరకు ప్రకటించలేద సారథి విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయంపై ఉద్యమాలు నడిపిన దేవినేని ఉమామహేశ్వరరావు నేడు చేతగాని దద్దమ్మలా మారారని ఎద్దేవా చేశారు. గత ఏడాది బస్తా ధాన్యం రూ.1,400 అమ్మితే నేడు రూ.1,050కి కూడా కొనే దిక్కులేదన్నారు. పత్తి, సుబాబుల్ తక్కువ ధరకే కొంటున్నా టీడీపీ పాలకులు రైతుల పక్షాన ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. సుబాబుల్ రైతులకు ఒక కంపెనీ రూ.12 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా రైతుల పక్షాన మాట్లాడి ఇప్పించడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. కౌలు రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదన్నారు.
రాజధాని రైతులను ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు...
తమకు జీవనాధారంగా ఉన్న భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేది లేదని చెబుతున్న రైతులను స్వయంగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారని సారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో స్పష్టం చేయకుండా టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే వైఎస్సార్‌సీపీ నేతలు అంతకన్నా అధికంగా స్పందిస్తారని ఆయన హెచ్చరించారు.
జనాన్ని మోసపుచ్చలేకే.. జగన్ సీఎం పదవిని వదులుకున్నారు...
ఎన్నికల సమయంలో చిత్తూరు పర్యటనలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఉన్నప్పుడు తామంతా వెళ్లి చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడని, మీరు కూడా ఆ హామీ ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల పంట రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ రుణాలను మాఫీ చేయడం జరిగే పని కాదని చెప్పారన్నారు. ప్రజలను దగా చేయలేనని, చంద్రబాబు మాదిరిగా పచ్చి అబద్ధాలు ఆడలేనని, ముఖ్యమంత్రి పదవి వచ్చినా, రాకున్నా ప్రజలను మోసం చేయలేనని స్పష్టం చేశారని వివరించారు. ఆనాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట నేడు నిజమైందన్నారు. ప్రజలను మోసపుచ్చలేక ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని గుర్తుచేశారు. కొందరు టీడీపీ నాయకులు చంద్రబాబుకు, జగన్‌కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారని, ఈ విషయం నిజమేనని, నక్క చంద్రబాబునాయుడు అయితే నాగలోకం జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు.
షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామన్నారు...
ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులూ లేకుండానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చాక అనేక అడ్డంకులు సృష్టించిందని ధర్నా పరిశీలకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే రైతులు, డ్వాక్రా మహిళలు నమ్మి ఆయనకు ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత రుణాలు రద్దు చేయకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీ కోసం ఇచ్చిన రూ.5 వేల కోట్లు వడ్డీకి కూడా చాలవన్నారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని, టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకాని నేపథ్యంలో, సమయం వచ్చినప్పుడు జుట్టు పట్టుకుంటారని హెచ్చరించారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అదే ధోరణిలో పచ్చని పొలాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకుని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలు వంచేది జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, ఈ ధర్నా కార్యక్రమం ఆరంభం మాత్రమేనని మోపిదేవి వెంకటరమణ చెప్పారు.
తాళం వేసిన తలుపునకే వినతిపత్రం...
ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చాంబర్‌కు వెళ్లే దారిలో తాళం వేసిన తలుపునకే వినతిపత్రం అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను, పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, మైలవరం, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, బూరగడ్డ వేదవ్యాస్, సింహాద్రి రమేష్, దుట్టా రామచంద్రరావు, పార్టీ నాయకులు దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఆయా నియోజకవర్గాల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పార్టీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఉమాది అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట...
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం కాలువ పనులు జరుగుతుంటే ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ పథకంపై దుష్ర్పచారం చేశారని చెప్పారు. మంత్రి పదవి చేపట్టాక.. పోలవరం కాలువ పనులు పూర్తయ్యాయని, ఈ కాలువ ద్వారానే కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేస్తామని నేడు చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, డ్వాక్రా, రైతు రుణమాఫీ జరిగే వరకు ముఖ్యమంత్రి మెడలు వంచి పనిచేయిస్తామన్నారు.
పచ్చి మోసకారి.. చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసపుచ్చుతూ దేశంలో పచ్చి మోసకారిగా మారారని వైఎస్సార్ సీపీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీపై ధర్నా నిర్వహిస్తామని చెప్పిన తరువాతే ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించి మాఫీ వివరాలు ప్రకటించారని చెప్పారు.
ధర్నాలో మాట్లాడుతున్న కొడాలి నాని, చిత్రంలో నేతలు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, రక్షణనిధి, మేకా ప్రతాప్, కల్పన, ఉదయభాను, జోగి రమేష్, వేదవ్యాస్, గౌతంరెడ్డి, సింహాద్రి, దుట్టా, దూలం నాగేశ్వరరావు తదితరులు (ఇన్‌సెట్) చిలకలపూడి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న కొలుసు పార్థసారథి