ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి | YSRCP fires on TDP government | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి

Published Sun, Mar 8 2015 1:35 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

YSRCP fires on TDP government

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజాసమస్యలపై గళం విప్పి పరిష్కరించేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు అయిన శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడ్డాక జగన్ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఇందులో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని, అలాంటి విషయాల్లో ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని  గట్టిగా నిలదీయాలని కోరారు. సమావేశాలకు ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి అంశంపైనా అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా  పోరాడాలని సూచించారు.

ఆ అంశాల్లో ఏది మంచిది కాదో చెప్పాలి: గడికోట
అసెంబ్లీలో చర్చకోసం బీఏసీలో తమ పార్టీ ప్రతిపాదించిన అంశాల్లో ఏది మంచిది కాదో అధికారపక్షం ప్రజలకు చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభాపక్షం సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తామిచ్చిన 22, అధికారపక్షమిచ్చిన 12 మొత్తం 34 అంశాలపైనా చర్చ జరగాలనే తమ పార్టీ శాసనసభాపక్షం కోరుకుంటోందన్నారు. కరువు పరిస్థితులు మొదలు, జీవో నంబర్ 22 జారీ వెనుక అవినీతి, నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగునీటి సమస్యలు    శాసనసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కళత్తూరు నారాయణస్వామి, కోన రఘుపతి, కిలివేటి సంజీవయ్య, అత్తారు చాంద్‌బాష, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement