కన్నీటి వీడ్కోలు
యద్దనపూడి, మార్టూరు, న్యూస్‌లైన్: అనారోగ్యానికి గురై శనివారం మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పర్చూరు సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు భౌతికకాయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసింహారావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆయన్ని పరామర్శించారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ నరసింహారావు తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని జిల్లాకు వచ్చారు.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి వచ్చి అక్కడి నుంచి చిలకలూరిపేట మీదుగా యద్దనపూడిలోని గొట్టిపాటి స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన భార్య పద్మ, కుమారుడు భరత్, కుమార్తె లక్ష్మిలను ఓదార్చారు. ఆయన తమ్ముడి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలినేని గొట్టిపాటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దాదాపు గంటపాటు గొట్టిపాటి నివాసంలో గడిపిన అనంతరం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణమయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు: పార్టీ నేతలు, అభిమానులు అశ్రునయనాలతో గొట్టిపాటి నరసింహారావుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, ప్రజలు యద్దనపూడి తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, బాపట్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి, పాలేటి రామారావు, ముక్కు కాశిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, దారా సాంబయ్య, దివి శివరాం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ నేతలు తూమాటి మాధవరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డిలతోపాటు నేతలు, కార్యకర్తలు, ప్రజలు నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించారు.
అంతిమ యాత్రకు భారీగా తరలిన జనం..
గొట్టిపాటి నరసింహారావు అంతిమ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరింది. నరసయ్య అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు.. నాయకులు, కార్యకర్తలు ఆయన పార్ధివ దేహం వెంట తరలి వచ్చారు. ఆయన కుమారుడు భరత్ తన తండ్రి భౌతికకాయం ముందు నడుస్తూ ఉంటే అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. గొట్టిపాటి రవికుమార్ అన్న పాడె మోశారు.
అంతిమ యాత్ర యద్దనపూడి సెంటర్ నుంచి వింజనంపాడు రోడ్డులోని నరసింహారావు సొంత పొలం వరకు కిలోమీటరు పొడవున భారీ జన సందోహం మధ్య సాగింది. దారిపొడవునా అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆయన భౌతికకాయం వెంట నడిచారు. గం.2.30కు ఆయన సొంత వ్యవసాయ క్షేత్రానికి అంతిమ యాత్ర చేరుకుంది. గొట్టిపాటి నరసింహారావు కుమారుడు భరత్ ఆయన చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రి పాలేటి రామారావు, మార్టూరు, యద్దనపూడి, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు మండల పార్టీ కన్వీనర్‌లు పటాన్ కాలేషావలి, ధూళ్లిపాళ్ల వేణుబాబు, కోటా విజయభాస్కరరెడ్డి, బండారు ప్రభాకరరావు, తోకల కృష్ణమోహన్, నర్రా శేషగిరి, దొడ్డా బ్రహ్మం, పావులూరి వెంకటేశ్వర్లు, దరువూరి వీరయ్య చౌదరి, అమ్మిరెడ్డి, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య, పోపూరి శ్రీనివాసరావు, చిన్నికృష్ణ, చెరుకూరి అనిల్, సుబ్బారెడ్డి, మల్లినీడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా తరలి వచ్చిన ప్రజలు, నాయకులు
గొట్టిపాటికి నివాళులర్పించటానికి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తరలి వచ్చారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆయనకు నివాళులర్పించారు.