
ఆవుదోడి వంకలో ధర్నాకు కూర్చున్న కౌన్సిలర్ తనయుడు సూర్యనారాయణ
కర్నూలు,ఆదోని: పట్టణంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, వైఎస్‌ఆర్‌సీపీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ వార్డు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అక్కడి రోడ్ల దుస్థితిపై 22వార్డు కౌన్సిలర్ లలితమ్మ ఫ్లెక్సీలు ప్రదర్శించగా తాజాగా శుక్రవారం 30వ వార్డు కౌన్సిలర్ శేఖమ్మ తనయుడు, వైఎస్సార్సీపీ నాయకుడు సూర్యనారాయణ ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా గౌళిపేటలోని ఆవుదోడి వంక (ప్రధాన మురుగు కాలువ)లో పూడిక తీయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ మురుగు కాలువలోనే రెండు గంటల పాటు కూర్చున్నారు. ‘ఈ కాలువకు ఇరువైపులు వందల మంది నిరుపేదలు నివసిస్తున్నారు.. వారంతా దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విషజ్వరాల బారిన పడ్డారు.
కాలువలో పూడిక తీయిస్తే కొంత వరకు సమస్య తీరుతుంద’ని తన తల్లి శేఖమ్మ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. సమస్య తీవ్రతను అధికారులకు తెలియజేసేందుకు మురుగు కాలువలో కూర్చొని నిరసన తెలుపుతున్నానని చెప్పారు. వార్డుదర్శిని కార్యక్రమానికి హాజరైన కమిషనర్ రామలింగేశ్వర్, ఎంఈ విశ్వనాథ్, డీఈలు రామమూర్తి, సత్యనారాయణ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నేటి నుంచే కాలువలో పూడిక తీత పనులకు చర్యలు చేపడతామని, ధర్నా విరమించాలని కోరారు. దీంతో సూర్యనారాయణ నిరసన విరమించారు. వార్డు ప్రజల సమస్య పరిష్కారం కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మురుగు కాలువలో ధర్నా చేపట్టిన కౌన్సిలర్ తనయుడికి స్థానిక ప్రజలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment