మండలంలోని ఎస్‌యూపురానికి (శ్రీనివాస ఉదాసనపురం) చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మల్లిమడుగు రిజర్వాయర్ ఆయకట్టు సంఘం డెరైక్టర్ రఘుపతి(51) బుధవారం రాత్రి 7.
రేణిగుంట, న్యూస్‌లైన్: మండలంలోని ఎస్‌యూపురానికి (శ్రీనివాస ఉదాసనపురం) చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మల్లిమడుగు రిజర్వాయర్ ఆయకట్టు సంఘం డెరైక్టర్ రఘుపతి(51) బుధవారం రాత్రి 7.15 గంటలకు రేణిగుంటలో హత్యకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు.. రేణిగుంట ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద రఘుపతి బస్సు కోసం వేచి ఉండగా దిగువ మల్లవరానికి చెందిన సుబ్రమణ్యం ఆచారి(42) అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా పిడిబాకుతో రఘుపతిని పొడిచాడు.
అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన రఘుపతిని అక్కడే ఉన్న బంధువు లు రేణిగుంటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ అందించేలోపే ఆయన మృతి చెందా రు. పదిహేనేళ్లుగా ఇద్దరి మధ్య ఉన్న కక్షల కారణంగానే హత్య చేశానని సుబ్రమణ్యం ఆచారి తెలిపాడు.
అయితే సుబ్రమణ్యం ఆచారి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని పోలీసులకు రఘుపతి సమాచారం ఇచ్చారనే కారణంగా ఈ హత్య జరిగినట్లు స్థానికుల కథనం. సీఐ రమణకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జువ్వల దయాకర్‌రెడ్డి, రామ్మోహన్, పట్టణ కన్వీనర్ నగరం భాస్కర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.