
గణపవరం (నిడమర్రు) : నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను చంద్రబాబు నిండా ముంచారని, ఇంకెప్పుడూ ఇలాంటి కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దని మంచి గుణపాఠం చెప్పారని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి నిడమర్రు మండలం అడవికొలనులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ గొంతులు చించుకుంటున్న టీడీపీ నాయకులు పల్లెలకు వచ్చి చూస్తే వారు చేసిన అభివృద్ధి ఎంతగొప్పగా ఉందో తెలుస్తుందన్నారు. కేవలం మాయమాటలు, గారడీలతోనే ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ మాటమార్చడం ఈ దేశంలో చంద్రబాబుకే సాధ్యమైందని విమర్శించారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తయారు చేస్తామని డాంబికాలు పలుకుతున్నారన్నారు. సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులే పంచుకుంటూ, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
పార్టీ జిల్లా నాయకులు నడింపల్లి సోమరాజు, మాదేటి సురేష్, పుప్పాల గోపి, ముళ్లగిరి జాన్సన్, తెనాలి సునీల్, బేతు రాజశేఖర్, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, భీమడోలు మండలాల కన్వీనర్‌లు సంకు సత్యకుమార్, దండు రాము, మరడ వెంకట మంగారావు, రాయపాటి సత్య శ్రీనివాస్, పార్టీ నాయకులు కోడూరి రాంబాబు, నిమ్మల బాబూరావు, బత్తి సాయి, గొట్టుముక్కల విశ్వనాథరాజు, గోలి శేఖర్, బుద్దారపు పుల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment