రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
ఒంగోలు: తమ పార్టీకి చెందిన ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారంలో తక్షణమే టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని వైఎస్ఆర్ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో రిటర్నింగ్ అధికారి జవహర్లాల్ను వైవీ సుబ్బారెడ్డి, బాలినేని కలిసి... టీడీపీ నేతలు ఎంపీటీసీ కొనుగోలు వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా రిటర్నింగ్ అధికారికి సమర్పించి ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను కొనుగోలు చేసి క్యాంపునకు తరలించిన టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రలోభ పెట్టి తమ పార్టీ సభ్యులను క్యాంపునకు తరలించిన టీడీపీ అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని వారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీడీపీ మంట కలుపుతోందని వారు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి జవహర్లాల్ స్పందించారు. ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన సుబ్బారెడ్డి, బాలినేనికి స్పష్టం చేశారు.