
'చంద్రబాబు పొలిటికల్ అఘోరా'
సాక్షి, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు 2019 దాకా అవకాశం లేదని, ఈ విషయంలో నంద్యాల ప్రజలు అదృష్టవంతులని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బాబుకు బుద్ధి చెప్పే అవకాశం నంద్యాల ప్రజల కాళ్ల ముందే ఉందని చెప్పారు. చంద్రబాబు ఓ పొలిటికల్ అఘోర అని అన్నారు. ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించి టీడీపీకి బుద్ధి చెప్పాలని నంద్యాల ప్రజలను కోరారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, నారాయణ స్వామిలతో కలసి ఆయన మాట్లాడారు.
రాచమల్లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యడానికి ఒక్క కారణమైనా చూపాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఓట్లెయమని అడిగేముందు ఒక్క హామీనైనా నెరవేర్చమా? అనే తలంపు టీడీపీ నాయకులకు వస్తుందని అన్నారు. 'ఫ్యాన్ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించారు. అలాంటి వారికి మళ్లీ ఓట్లెసి గెలిపించాలా?. నంద్యాల ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వారికి ఓట్లెసి గెలిపిస్తే.. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే సలహా పార్టీ మారమనేలా ఉంటుంది. నంద్యాల ప్రజలు న్యాయం వైపు నిలుస్తారని భావిస్తున్నా.'