‘సమరదీక్ష’కు భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం
జగన్ దీక్షకు భద్రత కల్పించని గుంటూరు పోలీసులు
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమరదీక్షకు భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. బందోబస్తు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు అంతకుముందే గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు. మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వెళ్లిన నేతలను కలిసేం దుకు ఎస్పీ నిరాకరించారు. అటు ఎమ్మెల్యే ఆర్కే కూడా బందోబస్తు కోరుతూ లేఖ రాశారు.
అయినప్పటికీ దీక్షలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. దీంతో తమ నాయకుడికి భద్రత కల్పించాలని కోరేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ లేకపోవడంతో ఎంపీ మేకపాటి ఫోన్ చేశారు. సరిగా స్పందించకపోవడంతో ఎస్పీ తీరుకు నిరసనగా కార్యాలయం ఎదుట నేతలు ధర్నా నిర్వహించారు.
మేకపాటి డీజీపీకి ఫోన్ చేసి, ఎస్పీ వైఖరిపై ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీ ఏఎస్పీ శ్రీనివాసులును పంపి భద్రతపై హామీ ఇప్పించడంతో ధర్నా విరమించారు. కాగా, ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఎస్పీ మీద పార్లమెంటు హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఎంపీలు.. శాసనసభ, మండలిలో హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు.