తారస్థాయికి టీడీపీ వేధింపులు !
కొండవూరు(పూండి): వజ్రపుకొత్తూరు మండలంలో టీడీపీ నేతల వేధింపులు తార స్థాయికి చేరాయి. మొన్న ఐకేపీ సీఎఫ్‌లు.. నిన్న మండలపరిషత్, తహశీల్దార్ కార్యాలయ అధికారులు, నేడు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.. ఇలా అందరినీ వేధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన ఆ పార్టీ నియోజికవర్గ అధినేత కార్యకర్తలను కొట్లాటకు ప్రోత్సహిస్తుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. దీనికి పోలీస్ బాస్‌లు ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ రవికిశోర్ వ్యవహార శైలిపై మహిళా సంఘాలు, కొండవూరు సర్పంచ్ కొల్లి రమేష్ మండిపడ్డారు. గ్రామంలో టీడీపీకి చెందిన సూళ్ల చిట్టిబాబు పింఛన్ల సర్వేపై ఈ నెల 22న అనధికారంగా గ్రామంలో దండోరా వేయించారు.
రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన తమకు చెప్పకుండా దండోరా వేయించడం ఏమిటంటూ చిట్టిబాబును సర్పంచ్ రమేష్ నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య కొట్లాట పెద్దదైయింది. ఇరువురూ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా ఎస్‌ఐ రవికిశోర్ తన సిబ్బందితో వచ్చి ఆదివారం గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులో బలంలేదని, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు బలంగా ఉందంటూ సర్పంచ్‌ను హెచ్చరించారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు, స్థానికులు ఎస్‌ఐని నిలదీశారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దని, తాముచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకోవాలని సర్పంచ్ కోరినా ఆయన స్పందిచలేదు. దీంతో కొద్దిసేపు సర్పంచ్ రమేష్, ఎస్‌ఐకి మధ్య వాగ్వాదం జరిగింది.
తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రైవేటు వ్యక్తులు హరించారని, ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సర్పంచ్ కె.రమేష్, ఎంపీటీసీ సభ్యుడు ఐ.అప్పన్న ఆరోపించారు. దీనిపై తాము కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయూన్ని ఎస్‌ఐ రవికిశోర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై సర్పంచి రమేష్, అతని సోదరుడు సురేష్, తండ్రి తవిటయ్యలపై కేసు నమోదు చేశామన్నారు. చిట్టిబాబుపై దాడి చేసి బైక్‌ను స్వల్పంగా నష్టపరచడంతో కేసు నమోదు చేశామన్నారు. తాము ఏకపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులో బలం లేదని వివరించారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.