సాక్షి,గుంటూరు : జన హృదయం మురిసింది.. జననేతకు ఘన విజయం కట్టబెట్టింది. టీడీపీ కంచుకోటలను సైతం బద్దలుకొట్టి 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించింది. గత ఎన్నికల్లో 12 స్థానాలు సాధించిన టీడీపీని రెండు స్థానాలకే పరిమితం చేసింది. జిల్లా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులను ఇంటిదారి పట్టించింది. డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న ధూళిపాళ్ల నరేంద్రకు ఓటమి రుచిచూపింది. స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్, మైనింగ్ మాఫియా కింగ్ యరపతినేని, ఇసుక, మట్టి దోపిడీలతో చెలరేగిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటమి బాట పట్టించింది. మరోవైపు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీని విజయ బాటలో నిలిపింది. జననేత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించే నవరత్నాల సంక్షేమ పాలనకు పూలబాట పరిచింది.
జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జై కొట్టారు.. అవినీతి, అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2004లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 స్థానాలతో జిల్లా ప్రజలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల తరువాత రాజన్న బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాలకు 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి రాజన్న కుటుంబంపై తమ అభిమానం చాటుకున్నారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓటమి చెందిందంటే ప్రజల్లో టీడీపీపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయకేతనాలు ఎగురవేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు, స్పీకర్‌తోపాటు మాజీ మంత్రులు, ముఖ్యనేతలను ప్రజలు మట్టి కరిపించారు.
2014 ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన టీడీపీ 2019 ఎన్నికల్లో పది సీట్లు కోల్పోయి రెండు సీట్లకు పరిమితం అయింది. రాజధానిలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రను ప్రజలు తిప్పికొట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఓటమి చెందడం చూస్తుంటే టీడీపీ పై ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన ప్రభావం కనిపించలేదు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు.
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో క్లీన్ స్వీప్
నరసరావుపేట పార్లమెంట్‌లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలో చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వినుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, గురజాల నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ ఘోర పరాజయం చెందారు. నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 20 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల భారీ మెజార్టీ సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీతో గెలు పొందిన విషయం తెలిసిందే. వినుకొండ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 19,582 మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులుపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 28,700 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం చూస్తుంటే ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీపై ప్రజలు ఏ స్థాయిలో తమ అభిమానాన్ని చాటుకున్నారో తెలుస్తోంది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీయేతర పార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 8 వేలకు పైచిలుకు మెజార్టీతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై బీసీ మహిళ విడదల రజిని విజయం సాధించడం గమనార్హం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, సీనియర్ మంత్రిగా, స్పీకర్‌గా పదవులు చేపట్టిన కోడెల శివప్రసాదరావుపై అంబటి రాంబాబు 21,200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 23 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది నాల్గోసారి వరుసగా విజయం సాధించి తన పట్టు నిలుపుకొన్నారు.
గుంటూరు పార్లమెంట్‌లో ఆరు స్థానాల్లో ఘన విజయం
గుంటూరు పార్లమెంట్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ సీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం చెందారు. పొన్నూరులో వరుసగా ఐదు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య విజయం సాధించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత 7,221 మెజార్టీతో గెలిపారు. మాజీ మంత్రి, తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ 17 వేలకు పైగా చిలు మెజార్టీ గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,759 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆలపాటి రాజా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం గమనార్హం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి 4,500 మెజార్టీతో విజయం సాధించారు.
మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి..
జిల్లాలో వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేసిన ఎనిమిది మంది మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. పొన్నూరు నుంచి కిలారి వెంకటరోశయ్య, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల నుంచి కాసు మహేష్‌రెడ్డి, వేమూరు నుంచి మేరుగ నాగార్జున, చిలకలూరిపేట నుంచి విడదల రజని తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. టీడీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన మద్దాళి గిరి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
కౌంటింగ్ మధ్యలోనే బయటకు జారుకున్న టీడీపీ అభ్యర్థులు
జిల్లాలో 17 నియోజకవర్గాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ సీనియర్ నేతలు కంగుతిన్నారు. టీడీపీకి బలమైన మండలాలు, గ్రామాల్లో సైతం వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో టీడీపీ సీనియర్లు సైతం మూడు నాలుగు రౌండ్‌ల తరువాత కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లిపోయారు. గురజాల మండలంలో వైఎస్సార్ సీపీకి 4,500 లకు పైగా మెజార్టీ రావడంతో ఐదో రౌండ్‌కే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థులు అంజిరెడ్డి, అరవిందబాబు సైతం మధ్యలోనే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి దారిపట్టారు.
రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ
జిల్లాలోని చిలకలూరిపేట, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రతి రౌండ్‌కూ మెజార్టీ మారుతుండటంతో అభ్యర్థులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు, ప్రజలు సైతం టెన్షన్‌కు గురయ్యారు. మొదటి నుంచి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకు పోయిన వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణంలో వెనుకంజ పడింది. అక్కడి నుంచి ప్రతి రౌండ్‌కు నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినప్పటికీ ఎట్టకేలకు 5,217 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
పొన్నూరు నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబర్చినప్పటికీ ఎనిమిదో రౌండ్ నుంచి అక్కడ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎట్టకేలకు 1,043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. చిలకలూరిపేట నియోజకవర్గం అయితే మొదటి నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజనికి స్పష్టమైన మెజార్టీ రావడంతో 8 వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి టీడీపీ అధిక్యం చూపుతూ వచ్చినప్పటికీ ఫిరంగిపురం మండలంలో వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం రావడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విజయ బావుటా ఎగురవేశారు.
మూడో రౌండ్‌లోనే వెనుతిరిగిన యరపతినేని
పిడుగురాళ్ల: సార్వత్రిక ఎన్నికల్లో గురజాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై ఘనవిజయం సాధించారు. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లపాడులోని లయోలా హైస్కూల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. మొదటి రౌండ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డికి మెజార్టీ వస్తుండటంతో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అవాక్కయ్యారు. గురజాల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ డలంలోనే ఎక్కువ పట్టు ఉందని ఆశించిన యరపతినేనికి గురజాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసుకే పట్టం కట్టడంతో ఓటమి తప్పదని భావించిన యరపతినేని మూడో రౌండ్‌లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఎంతో హుందాగా ఉన్న యరపతినేని మొదటి రెండు మూడు రౌండ్లకే పరాజయం పాలవుతానని భావించి ఈ ప్రాంతంలో ఉండటానికి ముఖం చెల్లక వెనుతిరిగారు.
ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యం : నందిగం సురేష్
బాపట్ల: ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తానని బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటామని, మాటలు చెప్పటంకాదు, ప్రజలకు మంచిచేసి చూపిస్తామని అన్నారు. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటంతోపాటు నిరుద్యోగ సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఢిల్లీలో కాకుండా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ గల్లీలోనే తిరుగుతానని చెప్పారు.
బాపట్ల అసెంబ్లీ నుంచి 19,509 ఓట్లు మెజార్టీ
బాపట్ల అసెంబ్లీ నుంచి బాపట్ల పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌కు 19,509 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 15 రౌండ్లులో లెక్కింపు నిర్వహించారు. మొత్తం నందిగం సురేష్‌కు 79,708 ఓట్లు, టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రికి 60,199 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ నందిగం సురేష్ అధిక్యతను ప్రదర్శించారు. నందిగం
సురేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి అభినందించారు.
వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ ముగ్గురు మహిళలను అసెంబ్లీ స్థానాల నుంచి పోటీలో నిలపగా తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళకు కూడా టిక్కెట్టు ఇవ్వకపోవడం గమనార్హం. వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై విజయం సాధించగా, తాడికొండ నుంచి పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై విజయం సాధిం చారు. తొలి రౌండ్ నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన చిలకలూరిపేట నుంచి బీసీ మహిళ విడదల రజిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment