సాక్షి, శ్రీకాకుళం : పాతపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. నాగభూషణరావు మృతితో పాతపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శాంతి-నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజర్వేటర్‌గా, డామన్ డయ్యూ టూరిజం డైరక్టర్‌గా, పర్యావరణం, కాలుష్యం, అడవులు, ఇందనవనరుల శాఖలకు సంబంధించిన పలు విభాగాల్లో పనిచేశారు. పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఓఎస్‌డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ పూర్తిగా నయమయ్యాక కొద్ది నెలల క్రితం మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నాగభూషణరావు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment