'సుధారాణి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు'
హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) బిల్లును అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సర్కార్ దురాగతాలకు పాల్పడుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు అభ్యంతర ఫారాలను ఇవ్వడానికి వెళ్తే గడువు ముగిసిపోయిందంటూ సర్కారు వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రైతు బోయపాటి సుధారాణి ఇంటికి పోలీసులు, టీడీపీ నేతలు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
సుధారాణి కుటుంబం వారి బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. అమాయక రైతులను పోలీసులు వేధిస్తున్నారని.. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే తీవ్ర ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.