
ఎందుకంత ఉలికిపాటు?
రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు?
⇔ టీడీపీపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
⇔ ప్రజా సమస్యలపై ప్రధానిని ప్రతిపక్షనేత జగన్ కలిస్తే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు? అసలు ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై ప్రధానిని కలిస్తే తప్పేంటి? అని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రశ్నించారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. పరిపాలనను చంద్రబాబు గాలికి వదిలేసినం దువల్ల ప్రజలు పడుతున్న అష్టకష్టాలను దూరం చేసేందుకు తమ అధినేత జగన్ ప్రధాని వద్దకు వెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని పత్రికా ప్రకటన రూపంలో తెలియజేసినా టీడీపీ నేతలు మాత్రం భయంతో వణికి పోతున్నారని, కేసుల మాఫీ కోసమే కలిశారంటూ మంత్రులు వంకర కూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
పుత్రశోకంలో ఉన్న మంత్రి నారాయణ కుటుంబానికి అండగా ఉండకుం డా జగన్‌పై పనిగట్టుకుని విమర్శలు చేయడంపై ప్రజలు చీదరించుకుం టున్నారని చెప్పారు. తనపై ఉన్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న నాయకుడు జగన్ అని, కేసుల కోసం కేంద్రం కాళ్లు మొక్కే అలవాటు చంద్రబాబుకే ఉందని విమర్శించారు. గతంలో చీకట్లో చిదంబరాన్ని కలసిన ఘనత బాబుదేనని రోజా విమర్శించారు.