పదే పదే మామీదే దాడులు
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు దృష్టికి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.ఈ దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని డీజీపీకి వివరించారు.
అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తన కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కరణం బలరాం, కరణం వెంకటేష్లు తన పై దాడిచేశారని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. టీడీపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి తనపై మూడు సార్లు దాడి జరిగిందని, తన అన్న గొట్టిపాటి కిషోర్ను కూడా రాజకీయ హత్య చేశారని, తనకు భద్రత పెంచాలని డీజీపీని కోరానని రవికుమార్ తెలిపారు.
మరోవైపు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లోటస్ పాండ్లో కలిశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద టీడీపీ వర్గీయులు చేసిన దాడి వివరాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ .. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.