
రాజధానిపై ఏకపక్షంగా వెళ్తున్నారు: వైఎస్సార్‌సీపీ
టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధానిపై ముందుగా అసెంబ్లీలో చర్చించి, ఓటింగ్ తర్వాతే ప్రకటన చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. రాజధాని అంశంపై ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని అధికార టీడీపీ తీరుపై ధ్వజమెత్తింది. అసెంబ్లీ నిబంధనల మేరకు నడుచుకుంటున్న వైఎస్సార్ సీపీ సభ్యులపై టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదని తెలిపింది. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సునీల్‌కుమార్, జలీల్‌ఖాన్, రక్షణనిధి విలేకరులతో మాట్లాడారు.
రాజధానిపై గురువారం సీఎం అసెంబ్లీలో ప్రకటన చేస్తారని, ఇందుకు సిద్ధాంతి ముహూర్తం పెట్టారని టీడీపీ సభ్యులు చెబుతున్నారని, చర్చ జరిగాక ప్రకటన చేయాలని గడికోట అన్నారు. ఈ విషయంలో రూల్స్ బుక్ స్పీకర్‌కు చూపించినా తమ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని, దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం కుటుంబ వ్యవహారంలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. కేబినెట్ సమావేశంలో సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, పరకాల ప్రభాకర్ వంటి వారిని అనుమతిస్తూ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రాజధాని 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోటే పెట్టాలనేది తమ అభిమతమని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్షంతో చర్చించి తర్వాత ప్రకటన చేస్తే ఆహ్వానిస్తామని, లేకుంటే ఓటింగ్‌కు వెళ్లాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రభుత్వం చర్చకు ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడంలేదని సునీల్‌కుమార్ అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలు తెలియవంటూ టీడీపీ సభ్యులు ముఖ్యమైన అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని జలీల్‌ఖాన్ అన్నారు.