
బ్లాంక్‌చెక్ ఇచ్చినది బాబే కదా?
- వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి
- విభజన వల్ల మూడు ప్రాంతాలకు తీరని నష్టం
- విభజించాలని మేమెప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదు
- న్యాయం చేయనందునే సమైక్యంగా ఉంచాలంటున్నాం
- మా విధానంపై కొన్ని పార్టీలు, ఒక వర్గం మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి
- టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన మాట వాస్తవం కాదా? రాష్ట్రాన్ని విభజించాలంటూ బ్లాంక్‌చెక్‌లాంటి లేఖ ఇవ్వలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీని విమర్శించేముందు టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ ఎవరు బ్లాంక్‌చెక్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేసిన లేఖలను పరిశీలించాలని వారికి సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్షంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని తెలియజేస్తూ ఇచ్చిన లేఖలను విడుదల చేశారు.
ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా తమ పార్టీ కోరిందన్నారు. రాష్ట్ర విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ లేఖ ఇచ్చిందని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజన జరిగితే దానివల్ల మూడు ప్రాంతాలకు అన్ని విధాలా తీరని నష్టం వాటిల్లనుందని, అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. అంతేకాదు విభజన వల్ల తలెత్తే అంశాలను వివరిస్తూ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానికి లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే కొన్ని ముఖం చెల్లని రాజకీయ పార్టీలు, వాటికి బాకా కొట్టే పత్రికలు, చానళ్లు తమ పార్టీ విధానాన్ని చిలువలు పలువలు చేస్తూ వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. నిద్రపోయే వారిని లేపవచ్చు. కానీ నిద్రలో ఉన్నట్లు నటించేవారిని ఏం చేయగలమని ఎద్దేవాచేశారు.
కేంద్రానిది ఒంటెత్తు పోకడే...
సీడబ్ల్యూసీ జూలై 30న చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోంశాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్లు షిండే ప్రకటించడాన్ని మైసూరా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వారి పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి విధానాన్ని మార్పు చేయించాలని సూచించారు. ‘‘ప్రస్తుత విభజనవల్ల నదీజలాల విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మిగులు జలాలపై ఆధారపడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, భీమా వంటి ప్రాజెక్టులకు సమస్యలు తప్పవు. అదే విధంగా రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారవుతోంది’’ అని మరోసారి గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇవేవీ పట్టించుకోకుండా చేస్తున్న అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ.. తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు స్పీకర్ ఫార్మట్‌లోనే రాజీనామా చేశారని తెలిపారు.
పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిలు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా ఒంటెత్తుపోకడలు అవలంబిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా వారి పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా... ‘పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగా కనబడుతోందన్నట్లు... రాత్రివేళ చిదంబరంతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నది ఎవరు? కేసులు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో కాపాడిన ఘనత ఆయనది కాదా?
’ అని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్‌సీపీ లేఖ సారాంశం
‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం.’
టీడీపీ లేఖ సారాంశం
‘రాష్ట్ర విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం.’