దుర్వాసనపై వైఎస్సార్సీపీ యుద్ధం | YSRCP party Began to struggle | Sakshi
Sakshi News home page

దుర్వాసనపై వైఎస్సార్సీపీ యుద్ధం

Published Sun, Jan 19 2014 4:52 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

YSRCP party Began to struggle

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలు నగరం పాతబస్తీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న దుర్వాసనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పాతబస్తీ ప్రజలు ఉద్యమించారు.
 
 వన్‌టౌన్, ఉస్మానియా మలుపు, కుమ్మరిగేరి చౌరస్తాల ప్రాంతాల్లో మానవహారంగా ఏర్పడి  రహదారులను దిగ్బంధం చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కూడలిలో ఎస్వీ మోహన్‌రెడ్డి బైఠాయించారు. పార్టీ నాయకులు, స్థానికు లు, మహిళలు మూడుచోట్లా రెండు గంట లపాటు రహదారులను దిగ్బంధం చేశారు. ‘ బచావో బచావో.. ఏ బాస్ సే బచావో’ అంటూ ముస్లింలు నినాదాలతో మార్మోగించారు. అలాగే ‘కర్నూలును మరోభోపాల్ చేయకండి, ఆల్కాలీస్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దుర్వాసనతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని సూచించారు. దుర్వాసన ఫ్యాక్టరీది కాదంటూ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారుల దిగ్బంధంతో రాకపోకలు ఆగిపోవడంతో వన్‌టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
 
 ఆందోళన విరమించాలని వైఎస్సార్సీపీ నాయకులను కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు మరో పదిమంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంట తర్వాత సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టుకు నిరసనగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట మంత్రి టీజీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునీర్ అహ్మద్, సలీం, నగర కన్వీనర్ బాలరాజు, మైనారిటీసెల్ నగర కన్వీనర్ షరీఫ్, యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లాకన్వీనర్ కిషన్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, మాజీ కార్పొరేటర్ పులిజాకబ్, మైనారిటీ నాయకులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, ఎం.ఎ.హమీద్, పి.టి.మురళి, కంఠు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement