'వైఎస్ జగన్ ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం కాదు'
గుంటూరు: రానున్న కాలంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల వారికోసం ముఖ్యమంత్రి కానున్న నేత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీల్లో చర్చించిన పలు అంశాల్లోని ముఖ్యమైన వాటిని ఆయా నేతలు జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల మధ్య ప్రకటించారు.
ఈ సందర్భంగా తొలి తీర్మానాన్ని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రవేశపెట్టారు. అనంతరం గుడివాడ అమర్‌నాథ్ విశాఖ పట్నం జిల్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర్మానంలో భాగంగా విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే రైల్వే జోన్, పోలవరం నుంచి తాగు నీరు సాగునీరు ఇవ్వడంతోపాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రారంభించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో 95ను వెంటనే రద్దు చేయాలని తీర్మానంలో కోరారు. విశాఖ గ్రామీణ ప్రాంత చెరుకు రైతులకు రూ.3000 గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. అలాగే, గాజువాక, సింహాచలం భూసమస్యలు పరిష్కరించాలని తీర్మానంలో కోరారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తీర్మానాన్ని కన్నబాబు ప్రవేశపెట్టారు. పౌష్టికాహార లోపంతో చాపరాయిలాంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాలు సైతం లేక సతమతమై పోతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, ప్రతి సందర్భంలో వైఎస్ జగన్ మాత్రమే ఏజెన్సీలో సందర్శించి సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వ సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి డిమాండ్ చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ దారుణంగా తయారైందని, వైఎస్‌ఆర్ హయాంలో గొప్పగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వాన్నంగా మార్చారని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకు చేశారని ఆ పన్ను పెంపును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.