
ఐదేళ్లకు సరిపడా ఉత్తేజం
రానున్న ఐదేళ్లకు సరిపడా ‘జోష్’ను తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో నింపారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు, జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
సాక్షి, రాజమండ్రి :రానున్న ఐదేళ్లకు సరిపడా ‘జోష్’ను తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో నింపారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు, జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సమీక్ష సమావేశాలకు జగన్ బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో శ్రీకారం చుట్టారు. మూడురోజులు జరిగే సమీక్షల్లో తొలిరోజు కాకినాడ, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సమీక్షించారు.
అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలయ్యాక అనతి కాలంలోనే పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు తమ సమక్షానికే వచ్చి సమీక్షించడం తమలో మరింత ఉత్సాహపరిచి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యోన్ముఖులను చేసిందన్నారు. పార్టీ శ్రేణుల చెంతకు వచ్చి సమీక్షించడంతో జగన్ కొత్త ఒరవడికి నాంది పలికినట్టయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను దీటుగా ఎదుర్కొంటూ, పార్టీకి దిశానిర్దేశం చేసే గురుతర బాధ్యతను జగన్ వహించాలని అన్ని ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తమది ఓటమిగా భావించడం లేదన్నారు.
తెలుగుదేశం పార్టీ కంటే తమకు కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని, ప్రజలు వారి పక్షాన నిలబడేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తమను నిలిపారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే ఓ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కాక తర్వాత కూడా కొన్ని పచ్చ పత్రికలు తమపై దుమ్మెత్తిపోయడం మానడం లేదని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్షమైన తమకు మీడియా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతారంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. సమీక్ష సందర్భంగా అధినేత జగన్, కార్యకర్తలు పరస్పరం మనసు విప్పి మాట్లాడుకున్నారన్నారు.