ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పోరాటం'
న్యూఢిల్లీ: ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 'చంద్రబాబు ఇప్పటికైనా మీరు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కనపెట్టండి' అని అన్నారు. 'రాష్ట్ర విభజనపై మీ నిర్ణయం ఏంటో ఇప్పటికైనా చెప్పండి' పద్మ మండిపడ్డారు.
ఢిల్లీ వేదికగా సమైక్య పోరును వినిపిద్దాం అని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలోజరిగే సమైక్యధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు.
ఛలో ఢిల్లీ పేరుతో నిర్వహించే సమైక్య ధర్నా కోసం రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం ఉదయం10 గంటలకు రేణిగుంట నుంచి, సాయంత్రం 4:30 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయని ఆమె వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ధర్నా పోస్టర్ ను పార్టీ నేతలు విడుదల చేశారు.