బహుముఖ పోరు | YSRCP Samaikyandhra Movement in srikakulam | Sakshi
Sakshi News home page

బహుముఖ పోరు

Published Sun, Dec 15 2013 3:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

YSRCP Samaikyandhra Movement in srikakulam

ఆవిర్భవించిన అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవనంతో మరింతగా మమేకం కావడానికి విశేషంగా కృషి చేస్తోంది. వ్యవస్థాగతంగా బలపడటం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ.. ప్రజా సమస్యలపై పోరాటం.. వివిధ అంశాలపై వారితో చైతన్యం ప్రోది చేయడం వంటి బహుముఖ లక్ష్యాలతో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ ముందుండి పోరాడుతున్న పార్టీ అదే సమయంలో గడప గడపకు పార్టీ, బూత్ క మిటీల నియామకం వంటి పార్టీ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళుతోంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమం విషయంలో యువతను చైతన్యపరిచేందుకు కృషి చేస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మించడంలో ముందున్న వైఎస్‌ఆర్‌సీపీ అదే స్ఫూర్తి కొనసాగిస్తోంది. సమైక్య శంఖారావం పూరించిన నాటి నుంచి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తోంది. జిల్లాలోని పది నియోకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతల నేతృత్వంలో నిత్యం పలు ప్రాంతాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ నెల 10 నుంచి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. మొదటి రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో, ఆ తరువాత మహిళలు, అనంతరం రైతులు.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలతో అన్ని విభాగాల వారిని పోరాటంలో భాగస్వాములను చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. కొన్ని చోట్ల ఎవరికి వారే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమైక్య ఉద్యమ ఆవస్యకతను చెబుతున్నారు.
 
 గడపగడపకూ..
 జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్ళి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమా లు, పార్టీ ప్రణాళిక, విధానాల గురించి పూర్తిస్థాయి లో వివరిస్తున్నారు. పార్టీ రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నట్లు సమన్వయకర్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం దాదాపు 50 శాతం పూర్తయిందని పార్టీ జిల్లా కన్వీనర్ కృష్ణదాస్ తెలిపారు. 
 
 ఓటర్ల నమోదుపై అవగాహన
 ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమానికి పార్టీపరంగా సహకరిస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను, ఓటరుగా నమోదు కావలసిన ఆవశ్యకతను వివరిస్తూ  ఎక్కువ మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదస్సుల వద్దకు వ చ్చిన వారికి దరఖాస్తు ఫారాలు కూడా ఇచ్చి, వివరాలు నమోదు చేయించి, అధికారులకు అందజేస్తున్నారు. ఓటు ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడే వారిని ప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశముంటుందని వివరిస్తూ విద్యార్థులు, యువతకు అకర్షిస్తున్నారు. 
 
 బూత్ కమిటీల ఏర్పాట్లలో నిమగ్నం
 మరోవైపు అన్ని నియోకవర్గాల్లో బూత్‌స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటులో నాయకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 70 శాతం పైగా బూత్ కమిటీల నియామకాన్ని పూర్తిచేసినట్లు సమన్వయకర్తలు తెలిపారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి ముఖ్య నాయకులతో మాట్లాడి వారి ద్వారా కమిటీల ఏర్పా టు ప్రక్రియ చేపట్టారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం, పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజవర్గాల్లో 70 శాతానికిపైగా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. 4 రోజుల్లో మొత్తం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement