రోడ్ల దిగ్బంధం విజయవంతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు సమైక్య ఉద్యమానికి తమ సహకారాన్ని అందించారు. నరసన్నపేట వద్ద 16వ నంబరు జాతీయ రహదారిని వైఎస్సార్‌సీపీ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఇరు వైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కరిమి రాజేశ్వరరావులు పాల్గొన్నారు.
టెక్కలిలో జాతీయ రహదారిని నాయకులు దిగ్బంధించారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగతిమెట్ట వద్ద వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. ఇచ్ఛాపురంలో పార్టీ నాయకులు జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వీ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లొద్దబుడ్డి జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బి.హేమమాలినిరెడ్డి, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన కన్వీనర్లు పాల్గొన్నారు.
శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారిపై వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించారు. కార్యక్రమంలో నందమూరి లక్ష్మీపార్వతి, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణ సమైక్యాంధ్ర జెఏసీ సభ్యులు పట్టణ వీధుల్లో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలాస -కొసంగిపురం హైవేపై వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వజ్జ బాబూరావు నాయకత్వంలో రోడ్డు దిగ్భందం, వంటావార్పు కార్యక్రమం జరిగింది. సాయంత్రం మరో సమన్వయకర్త కణితి విశ్వనాథం ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు.
పాతపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కలమట వెంకటరమణ నాయకత్వంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజాంలో నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజె బాబూ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాం- విశాఖ రోడ్డులో బైఠాయించి ధర్నా చేశారు. సుమారు గంట పాటు వాహననాల రాకపోకలను అడ్డుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు శ్రీకాకుళం పట్టణ సమీపంలోని సింహద్వారం వద్ద జాతీయ రహదారి దిగ్బంధించారు. రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థులు, యుకులు మద్దతుగా నిలిచారు.
అనంతరం యూపీఏ చైరన్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర సాధనకోసం తమ పార్టీ సంపూర్ణంగా కట్టు బడి ఉందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్రమంత్రి తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరదు కల్యాణి, ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణ, నేతలు హనుమంతు కిరణ్‌కుమార్, దుప్పల రవీంధ్రబాబు, అందవరపు సూర్యనారాయణ పాల్గొన్నారు.ఎచ్చెర్ల నియోజక వర్గానికి సంబంధించి రణస్థలంలో హైవేని దిగ్బంధించారు. ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కి రణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయికుమార్, కరిమజ్జి భాస్కరరావు, గొర్లె అప్పల నర్సునాయుడు పాల్గొన్నారు.