రహదారుల దిగ్బంధం సక్సెస్
Published Fri, Nov 8 2013 3:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం రెండో రోజైన గురువారం శతశాతం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు కదలికదం తొక్కారు. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలతో నిరనస తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, ఇచ్ఛాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబుతో పాటు పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
నర్సన్నపేట, శ్రీకాకుళం పట్టణాల్లో 79 మంది అరె స్ట్ అయ్యారు. వీరిలో నర్సన్నపేట నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది సర్పంచ్‌లు ఉన్నారు. నర్సన్నపేటలో జరిగిన రహదారి దిగ్బంధంలో ధర్మాన కృష్ణదాస్‌తో పాటు 26 మంది అరెస్ట్ కాగా శ్రీకాకుళంలో పిరియా సాయిరాజ్‌తో పాటు 35 మందిని, టెక్కలిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి తరువాత విడిచిపెట్టారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌చార్జిల నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రవాణా స్తంభించింది.
హైవేపై వాహనాలు వేల సంఖ్యలో ఆగిపోయాయి.
శ్రీకాకుళం పట్టణంలో సాయంత్రం వైఎస్‌ఆర్ కూడలి వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలగడంలో సీఐ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వరుదు కల్యాణి, వైవీ సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పరవీంద్ర, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు, జిల్లా అడహక్ కమిటీ సభ్యులు అంధవరపు సూరిబాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషోత్తం, ప్రధాన రాజేంద్ర, కె.వి.వి. సత్యనారాయణను అరెస్టు చేశారు.
నరసన్నపేట ఎన్‌హెచ్-16 రహదారిపై ఆ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం జరిగింది. రోడ్డుకు రెండువైపులా సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రాఘవరావు సిబ్బందితో వచ్చి కృష్ణదాస్‌తోపాటు అనుచరులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దాసన్నను పోలీసులు విడిచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతు కిరణ్‌కుమార్, ఆరంగి మురళి, కరిమి రాజేశ్వరరావు, కనుజు సీతారాం, యాళ్ల కృష్ణంనాయుడు, ఆర్.అప్పన్న, ఎం.బైరాగినాయుడు పాల్గొన్నారు.
ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక వాడ వద్ద జరిగిన రహదారులు దిగ్బంధంలో సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస మండలాల నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మో హణరావు, పార్టీ మహిళా విభాగం సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, జిల్లా కమిటీ సభ్యులు పైడి కృష్ణప్రసాద్, కూన మంగమ్మలు పాల్గొన్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం మధ్య నడిచే బస్‌లు రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు కలిగాయి. సమన్వయకర్త బొడ్డేపల్లి మాధురి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం కొత్తరోడ్ జంక్షన్ వద్ద జరిగింది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామం వద్ద జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ పాల్గొన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో మండల కన్వీనర్ కొల్ల గోవిందరావు నేతృత్వంలో అలికాం-బత్తిలి రోడ్డులో, పాతపట్నంలో కొండాల అర్జునుడు నేతృత్వంలో నీల మణి దుర్గ అమ్మవారి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఇచ్ఛాపురం నియోజవర్గంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు ఇచ్ఛాపురం - బెల్లుపడ జాతీయ రహదారి పై రహదారి దిగ్బం ధనం జరిగింది. సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసి, రహదారి దిగ్బంధనం ఆపాలని నాయకులను హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయలేదు. పాలకొండ ఆంజనేయసెంటర్‌లో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి, నాయకులు కనపాక సూర్యప్రకాశరావు తదితరులు దాదాపు అరగంట సేపు రహదారిని గ్బంధించారు. సీతంపేట మండలంలో పాలకొండ-సీతంపేట ప్రధాన రహదారిలో కుశిమి జంక్షన్ వద్ద పార్టీ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో, భామిని మండలం సతివాడలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకోట ఆంజనేయులు, సతివాడ సర్పంచ్ పాత్రుకొండ రాంబాబు నేతృత్వంలో రాస్తారోకో చేపట్టారు.
రాజాం వైఎస్‌ఆర్ కూడలి వద్ద సమన్వయకర్త పీఎంజేబాబు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం జరిగింది. మాజీ ఎమెమల్యే కం బాల జోగులు పాల్గొన్నారు. పలాసలో కోసంగిపురం జాతీయ రహదారి కూడలి వద్ద రహదారి దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. ఈసందర్భంగా సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం, సమన్వయకర్త వజ్జ బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు నర్తు ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని కుశాలపురం బైపాస్ కూడలి వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల రోడ్డు దిగ్భంధం కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచి పోయింది. యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. నియోజక వర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎచ్చెర్ల నియోజక వర్గంలోని రణస్థలం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజక వర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. టెక్కలిలో జగతిమెట్ట హైవేపై రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. వాహనాలు నిలిచిపోవడంతో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, సంపతి రావు రాఘవరావు, కోత మురళీధర్, చింతాడ గణపతి, తిర్లంగి జానకిరామయ్య ఉన్నారు. సోనియాగాంధీ వేషధారిణిని శవయాత్ర నిర్వహించారు.నందిగాం మండలం జాతీయ రహదారి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, సీజీసీ సభ్యుడు కణితి విశ్వనాథం పాల్గొన్నారు.
Advertisement