పోరుబాటలో దారుల దిగ్బంధం | YSRCP successful road blockades in Rajahmundry | Sakshi
Sakshi News home page

పోరుబాటలో దారుల దిగ్బంధం

Published Thu, Nov 7 2013 1:58 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

YSRCP successful road blockades in Rajahmundry

 సాక్షి, రాజమండ్రి :ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా, రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తెలుగుగడ్డను నిలువునా చీలుస్తున్న తరుణంలో ప్రజల పక్షాన మేమున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. ప్రజల తరఫున ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చారు. అందులో భాగంగా బుధవారం జిల్లాలో జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులను పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. తుని నుంచి రావులపాలెం వరకూ 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోట్లాది విలువైన సరుకు రవాణాకు అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. మరో వంక 216 నంబరు జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలను పార్టీ కార్యకర్తలు, సమైక్య వాదులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో 99వ రోజు సమైక్య ఉద్యమం సెగలు కక్కింది. ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ పార్టీ నేతలు అంచెలంచెలుగా రహదారుల దిగ్బంధం చేశారు. రహదారుల దిగ్బంధం సందర్భంగా జిల్లావ్యాప్తంగా 611 మందిని అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 
 
 లాలాచెరువు సెంటర్లో..
 రాజమండ్రి లాలా చెరువు సెంటర్‌లో 16వ నంబరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుమారు గంట పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాలని నేతలు నినాదాలు చేశారు. పోలీసులు   ఆదిరెడ్డి, బొమ్మన, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, సమైక్య ఉద్యమం అర్బన్ పర్యవేక్షకులు ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి తదితర 25 మంది నేతలను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.
 
  రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో జాతీయ రహదారిని రెండు గంటల పాటు దిగ్బంధం చేశారు. వేమగిరి వరకూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తూర్పు మండల డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో పోలీసులు 19 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ షిరిడీ సాయిబాబా పాత్ర ధరించి, సమైక్యాంధ్రకు మద్దతుగా లఘునాటిక ప్రదర్శించారు. సినీనటులు శోభన్‌బాబు, ఎన్‌టీఆర్, అక్కినేని వేషధారణలతో పార్టీ అభిమానులు నృత్యాలు చేసి సమైక్య వాదులను ఉత్తేజపరిచారు. 
 
 రోడ్డుపై వాలీబాల్..
 జగ్గంపేట నియోజక వర్గంలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కుమార్, ఇతర నేతల నేతృత్వంలో పార్టీ శ్రేణులు పలుచోట్ల జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కిర్లంపూడి మండలం సోమవరం వద్ద ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకూ రాస్తారో కో చేశారు. 12.00లకు బూరుగుపూడి చేరుకుని రోడ్డుపై వాలీ బాల్ ఆడారు. మధ్యాహ్నం 2.30 గంటలకు  రామవరం చేరుకుని 3.30 వరకూ రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి జగ్గంపేట చేరుకుని సాయంత్రం 4.00 నుంచి 5.00 వరకూ ఆందోళన కొనసాగించారు. కాగా రావులపాలెం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజక కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జిల్లా పార్టీ కన్వీనర్ చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ మార్గన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి కళా వెంకటరావు సెంటర్‌కు ర్యాలీగా చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. 
 
 20 మంది నేతలను అరెస్టు చేశారు. ఎర్రవరం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేరు కాలువల వంతెనలపై టెంట్‌లు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తునిలో పార్టీ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని-కొట్టాం సెంటర్ వద్ద  జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి అక్కడే వంటా వార్పూ చేపట్టారు. పోలీసులు  15 మందిని అరెస్టు చేశారు. అనంతరం కార్యకర్తలు రాజా ఆధ్వర్యంలో తొండంగి మండలం బెండపూడి చేరుకుని మరోసారి రహదారిని దిగ్బంధం చేశారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగల లక్ష్మి పాల్గొన్నారు. రాజానగరం వద్ద  జాతీయ రహదారిపై మండల  పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. యువనేత జక్కంపూడి గణేష్, మండల కన్వీనర్ మందారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 కెనాల్ రోడ్లోనూ ఆందోళన..
 అనపర్తి వద్ద రాజమండ్రి- కాకినాడ కెనాల్ రోడ్డుపై ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, పార్టీ నేత సత్తి సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. 40 మందిని పోలీసులుఅరెస్టు చేశారు. సామర్లకోట వద్ద ఫ్లై ఓవర్‌పై కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు 200 మందిని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలారు. పెద్దాపురం-జగ్గంపేట రహదారిలో పెట్రోల్ బంకు వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి సాయిప్రసాద్, తాడి రాజశేఖర్ తదితర నేతలు రోడ్డును దిగ్బంధం చేయగా 60 మందిని అరెస్టు చేశారు. మండపేట బైపాస్ రోడ్డు సమీపంలో కాకినాడ -రావులపాలెం రహదారిపై కో ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకటప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ తదితర నేతల నాయకత్వంలో ఆందోళన చేశారు. 35 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
 
 రాజమండ్రి- భద్రాచలం రోడ్డుపై..
 సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజమండ్రి- భద్రాచలం రోడ్డులో కోరుకొండలో రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు.ఆమెతో పాటు 25 మందిని అరెస్టు చేశారు. రాజమండ్రి-సీతానగరం రహదారిని సీతానగరంలో మండల కన్వీనర్లు అడ్డుకున్నారు. రంపచోడవరం నియోజక వర్గ పరిశీ లకులు కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి- భద్రాచలం రహదారిని ఐ. పోలవరం జంక్షన్ వద్ద దిగ్బంధించారు. పార్టీ ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ పల్లాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై బుధవారం అర్ధరాత్రి కట్టెలు, టైర్లు తగలబెడుతూ రాకపోకలను అడ్డుకున్నారు. కాగా పార్టీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం గురువారం కూడా కొనసాగనుంది.
 
 కోనసీమలో కదలని వాహనాలు
 కోనసీమలో 216 జాతీయ రహదారిని పార్టీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ఎర్రవంతెన వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు గంటపాటు దిగ్బంధం చేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు,  మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు బుచ్చిమహేశ్వరరావు, మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు 55 మంది నేతలను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.  ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై గంటన్నర పాటు ధర్నా చేసి, సమైక్య నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు.
 
 నియోజక వర్గ కో ఆర్డినేటర్ గుత్తులసాయి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు పాల్గొన్నారు. వంద మందినిపోలీసులు  అరెస్టు చేశారు. మురమళ్లలో పార్టీ నాయకుడు సుదర్శన బాబు ఆధ్వర్యంలో రహదారిని ముట్టడించారు. పి.గన్నవరం వద్ద అక్విడెక్టుపై పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. పి.గన్నవరం పోలీసులు రంగంలోకి దిగి నేతలను అరెస్టు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, కొండేటి చిట్టిబాబు, మందపాటి కిరణ్‌కుమార్, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, ఇండస్ట్రియల్ సెల్ జిల్లా కన్వీనర్ మంతెన రవిరాజు తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో చేస్తున్న సుమారు 16 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దిండి వద్ద జాతీయ రహదారిపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, కో ఆర్డినేటర్ చింతలపాటి వెంకటరామరాజు, మట్టా శైలజ, బొతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 
 
 ఇటుకలతో గోడ కట్టి..
 మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నేతలు పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారికి అడ్డంగా ఇటుకలతో గోడ కట్టి రాకపోకలను స్తంభింప చేశారు. రాస్తారోకో చేసి అక్కడే వంటా వార్పూ చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆందోళన కొనసాగించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.  పోలీసులు రంగ ప్రవేశం చేసి 31 మందిని అరెస్టు చేసి స్వంత పూచీ కత్తుపై విడుదల చేశారు. ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ-యానాం రోడ్డులో ఉప్పలంక వద్ద  రూరల్ కో ఆర్డినేటర్ వేణుగోపాలకృష్ణ, పార్లమెంటు నియోజక వర్గ నేత చలమలశెట్టి సునీల్‌ల ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధం చేశారు. చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, బీసీ విభాగం కన్వీనర్ గుత్తుల రమణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement