ఎక్కడి వాహనాలు అక్కడే!
Published Thu, Nov 7 2013 3:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జిల్లాలో చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. 16వ నంబరు జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. డిపోల నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులు కూడా జాతీయ రహదారిపై ఆగిపోయాయి. వాహనాలు తిరగకపోవడంతో దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, మహిళలు నడిచి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, సీజీసీ సభ్యులు డాక్టర్ ఎంవీ కృష్ణారావు, డాక్టర్ కణితి విశ్వనాథం, కేంద్ర కార్యనిర్వాహ క మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పిరియా సాయిరాజ్‌తో పాటు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా నాయకులు తొలి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు రహదారుల దిగ్బంధన కార్యక్రమం కొనసాగింది. నర్సన్నపేట నియోజకవర్గంలోని పోతయ్యవలస గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ధర్మాన పద్మప్రియ నాయకత్వంలో సుమారు గంటపా టు రాస్తారోకో నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా లారీల వారు, దూర ప్రయాణాలు చేసే వారు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్‌ఆర్‌సీపీ వారు ప్రయాణికులకు నచ్చజెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో రోడ్ల దిగ్బంధన కార్యక్రమం జరిగింది. సత్యవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభింప చేశారు.
అనంతరం కొద్ది సేపు నరసన్నపేట టౌన్‌లో ఆర్‌టీసీ కాంప్లెక్స్, వైఎస్సార్ జంక్షన్, పాతబస్టాండ్, పోలారి రోడ్డు జంక్షన్, జాతీయ రహదారిపై, జమ్ము జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. సాయంత్రం జమ్ము జంక్షన్ వద్ద దిగ్భందన కార్యక్రమంలో పార్లమెంటరీ పరిశీలకులు పిరియాసాయిరాజ్ పాల్గొన్నారు. టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించడంతో హైవేపై సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు డాక్టర్ ఎంవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం-బెల్లుపడ జాతీయ రహదారి దిగ్బంధించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పలుమార్లు పోలీసులు ఒత్తిడి చేసి కార్యక్రమాన్ని ఆపివేయించారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కోశంగిపురం జాతీయ రహదారి కూడలి వద్ద కార్యక్రమంజరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రతిఘటించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాధం, నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావును కాశీబుగ్గ పోలీసులు బలవంతంగా తీసుకుపోయారు. తర్వాత అక్కడే పార్టీ నాయకులు వంటావార్పు నిర్వహించారు. డివిజన్ కేంద్రమైన పాలకొండలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి.
ఆమదాలవలసలో రాస్తారోకో, రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజలు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్వర్యంలో రాజాంలో రహదారులు దిగ్బంధించారు. పాలకొండ, శ్రీకాకుళం రోడ్లలో బారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాల నాయుకులు పాల్గొన్నారు.
పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ నేతృత్వంలో కేసీ రోడ్డులో (కిమిడి-కళింగ రో డ్డు) రాస్తారోకో నిర్వహించారు. మెళియాపుట్టి లో పలాస, పర్లాకిమిడి రహదారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు రహదారిని దిగ్బంధం చేశారు. మూడు రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కొత్తూరులో మాతల వంతె న వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్తూరు-అడ్డుభంగి రహదారిని దిగ్భందం చేశారు. హిరమండలంలో గొట్టా బ్యారేజ్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజకవ వర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం మండలాలకు చెం దిన వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ నాయకుల నాయకత్వంలో సింహద్వారం సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది.
62 మంది అరెస్ట్
జిల్లా వ్యాప్తంగా పోలీసులు రహదారుల దిగ్బంధనాన్ని పలు చోట్ల అడ్డుకున్నారు. రెండు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆమదాలవలసలో 47 మంది, రాజాంలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. రాజాంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాచేస్తున్నవారిని బలవంతంగా వాహనాలు ఎక్కించి స్టేషన్‌కు తీసుకు పోయారు.
Advertisement
Advertisement