రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి
పులివెందుల : సీఎం చంద్రబాబు ప్రజలను మోసగించినందుకే నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అరకొరగా మాఫీ చేశారని.. ఇది రైతులకు వడ్డికి కూడా సరిపోలేదన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి మోసగించారన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగమని లేక పోతే నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని చెప్పి వారిని కూడా మోసం చేశారన్నారు. కమిటీల పేరుతో లక్షల మంది వృద్ధుల పింఛన్లను తొలగించారన్నారు.
పేదరిక నిర్మూలన అని చెబుతున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఒక్క పక్కా గృహమైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏమి చేశారని పండుగ చేసుకుంటున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పట్టిసీమ పేరుతో చంద్రబాబు అనుచరులైన కాంట్రాక్టర్లు వేల కోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలను ఇన్ని విధాలుగా మోసంచేసిన చంద్రబాబు నేడు నవ నిర్మాణ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చేసిన మోసాలకు వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్షను వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలను మోసగించినందుకే నవనిర్మాణ దీక్ష
Published Tue, Jun 2 2015 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement