తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట బీసీ నిరసనకారులతో కిక్కిరిసిన రహదారి
వైఎస్సార్‌సీపీ నేతృత్వాన గురువారం బీసీలంతా రోడ్డెక్కారు. టీడీపీ సర్కారు తమను పూర్తిగా విస్మరించిందంటూ నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనలతో చిత్తూరులోని కలెక్టరేట్.. తిరుపతిలోని సబ్ కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. తిరుపతిలో కులవృత్తులను తెలిపేలా వినూత్నంగా బీసీలు ఆందోళనలో పాల్గొన్నారు. రెండు నగరాలలోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
చిత్తూరు కలెక్టరేట్, తిరుచానూరు: మోసం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు విమర్శించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. వారిని నిట్టనిలువునా ముంచా రని ధ్వజమెత్తారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గురువారం చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
వైఎస్ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ ఫలాలు అందించారన్నారు. విరివిగా రుణాలు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. బీసీలకు ఏం చేశారని రాజమండ్రిలో సభ నిర్వహిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే బీసీలందరికీ మేలు జరుగుతుందన్నారు.
అవినీతిని అధికారులే ఎండగడుతున్నారు
కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రమౌళి మాట్లాడుతూ రిటైరైన చీఫ్ సెక్రటరీలే చంద్రబాబు అవినీతిని ఎండగడుతున్న వైనాన్ని గమనించాలన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వం.. అవినీతి,అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకొని.. కలెక్టరేట్ ఎదురు ధర్నా చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బీసీలతోఓట్లేయించుకొని వారి అభివృద్ధికి కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఈ సీఎం బుద్ధి చెప్పాలన్నారు.
తిరుపతిలో వినూత్న నిరసన
తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీసీలు వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీ అరాచక పాలనలో కులవృత్తులన్నీ నిర్వీర్యం అయ్యాయని బీసీలు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదురుగానే నిరసనకు దిగారు. పనిముట్లతో రోడ్డెక్కారు. యాదవులు ఆవులకు గడ్డివేయడం, రజకులు బట్టలు ఇస్త్రీ, చేనేతలు బట్టలు నేయడం, కుమ్మరులు కుండలు కట్టడం, నాయీ బ్రాహ్మణులు క్షవరం చేస్తూ వ్యక్తం చేసిన నిరసనలు ఆకట్టుకున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలంతా కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఎన్నికలు వస్తుండటంతోనే సీఎం మరోసారి బీసీలకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారని బీసీ నాయకులు విమర్శించారు. గత ఎన్నికల సమయంలో 110 హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
మగ్గం కోసం రూ.1.5 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని చేనేతలన్నారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ఇస్తానన్న 33.1 శాతం రిజ ర్వేషన్ ఏమైందని బీసీ నాయకులు ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల హామీలు నెరవేర్చలేదు కానీ.. రూ.80 వేల కోట్లతో ఉప ప్రణాళిక ప్రవేశపెడతా వంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీసీలందరం ఉమ్మడిగా అభివృద్ధి కావాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే బీసీలందరికీ మేలు జరుగుతుందని బీసీ నాయకులు చెప్పారు. అంతకుముందు చిత్తూరులో జ్ఞాన జగదీశ్ ఆధ్వర్యంలో సంతపేట నుంచి బైక్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. సభ అనంతరం డీఆర్వో గంగాధర గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ రాజా పాల్గొన్నారు. తిరుపతిలో అన్నమయ్య సర్కిల్‌నుంచి సబ్ కలెక్టర్‌కార్యాలయం వరకు ర్యాలీగా నడిచారు. కార్యక్రమం అనంతరం ఏఓ చంద్రమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment