ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్‌ఆర్‌సీపీ
విజయనగరం మున్సిపాలిటీ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్‌ఆర్ సీపీ అని, వారి తరఫున పోరాటమే పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి త్వరలోనే జిల్లా కమిటీలను నియమిస్తామని, మరో నెల రోజుల వ్యవధిలో మండల, గ్రామ స్థాయి కమిటీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించినట్లు ప్రకటించారు. వీరు స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో చర్చించి గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తారన్నారు. ఇంతకుమందు నిర్వహించిన సమావేశంలో అందరి సూచనలు, సలహాలతో జిల్లా పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను రూపొందించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆమోదం తరువాత వాటిని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామన్నారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర మాట్లాడుతూ పింఛన్లు, ఎస్సీ,బీసీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల పరిశీలనకు... నిబంధనలకు నీళ్లొదలి, చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కమిటీలను నియమించిన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన ర్లపై 2వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చి, కమిటీలు నియామకం చేపట్టిన అధికారులను బాధ్యులు చేసి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.
స్థానికంగా అన్నీ తెలిసిన సామాజిక కార్యకర్తలను ఈ కమిటీల్లో నియమించాలని జీఓలు చెబుతుంటే, అధికారులు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తల పేర్లను సూచించి కమిటీలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కమిటీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. కమిటీల నియామక విషయంపై అసెంబ్లీలో చర్చించిన సందర్భంలో సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘ మా పార్టీ ప్రభుత్వంలో ఉంది , మా ఇష్టం’ అని సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడవలసి ఉంటుందని, అవసరమైతే పోట్లాటకు సిద్ధమని చెప్పారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభా సమావేశాల్లో ప్రకటించారని, ఆ నిర్ణయానికి వారు కట్టుబడకుంటే శాసనసభను కించపరిచినట్లేనని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాల కమిటీల్లో స్థానం కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై బాధ్యత వహించేది పార్టీ నాయకులా.. ప్రభుత్వమా అన్ని ప్రశ్నించారు. తమ పార్టీ మండల గ్రామ స్థాయి కమిటీలు నియమించటం ద్వారా ప్రజలకు మరింత చేరవవుతామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌చార్జ్ నెక్కల.నాయుడుబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ జమ్మాన.ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల.శ్రీరాములనాయుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపిల్లి సుదర్శనరావు, వేచలపు చినరామునాయుడు, మామిడి అప్పలనాయుడు, పతివాడ అప్పలనాయుడు , వల్లిరెడ్డి శ్రీను, జరజాపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిశీలకులు వీరే....
కురుపాం - పువ్వల మాధవరావు
పార్వతీపురం- ఎస్.పరీక్షిత్‌రాజు
బొబ్బిలి - జరజాపు ఈశ్వరరావు
సాలూరు- అవనాపు విజయ్
గజపతినగరం - మామిడి అప్పలనాయుడు
ఎస్‌కోట- పీరుబండి జైహింద్‌కుమార్
విజయనగరం- అంబళ్ల శ్రీరాములనాయుడు
నెల్లిమర్ల - జి.ఎస్‌రాజు, కడియాల రామకృష్ణ
చీపురుపల్లి- గొర్లె వెంకటరమణ