చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమించారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై నగర వీధుల్లో ర్యాలీ చేశారు. గిరింపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఎస్ మనోహర్ జెండా ఊపి ప్రాంరభించారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలం, చిత్తూరు నగరం నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో సీబీ రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, పలమనేరు రోడ్డు, గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. అక్కడి నుంచి హైరోడ్డు, బజారువీధి, చర్చివీధి, గాంధీ రోడ్డు, తిరుపతి రోడ్డు, ఆర్టీసీ డిపో రోడ్డు, ఆఫీసర్స్ లైన్, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఒక వాహనంలో తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థిని కూర్చోపెట్టారు. అక్కడే కేసీఆర్ వేషదారణలో ఉన్న వ్యక్తిని ఒక బాలుడు బాక్సింగ్ ఆడుతున్నట్టు ఊరేగించారు.
ప్రజలు ఉద్యమించాలి
వేర్పాటువాదాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రోత్సహించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏఎస్.మనోహర్ స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి కరుడుగట్టిన తెలంగాణ వాదులతో కలిసి ఎన్నికలకు వెళ్లినా ఏనాడూ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయలేదన్నారు. స్యూటర్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ 10 జిల్లాలకు చెందిన ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే 13 జిల్లాలకు చెందిన సీమాంధ్రులు ఎందుకు సమైక్యాంద్రను సాధించలేమని ప్రశ్నించారు. నాయకులను పక్కన పెట్టి ప్రజలు ఉద్యమించాలన్నారు. అప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు.
రాష్ట్రంలోని సీమాంధ్ర మంత్రులు చేతగానిదనం వల్లే రాష్ట్రం ముక్కలయ్యిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ తరపున కేంద్రానికి లేఖ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి వారి మనోభావాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి అన్నారు. అనంతరం చిత్తూరులోని మహాత్మ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మనోహర్ వినతిపత్రం ఇచ్చారు. స్కూటర్ ర్యాలీలో పార్టీ నేతలు రామ్మూర్తి, మదన్, సాయిసుజిత్, కుట్టీ రాయల్, సయ్యద్, అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ భారీ బైక్ ర్యాలీ
Published Wed, Aug 7 2013 4:44 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement