
అప్పుడు దండగ... ఇప్పుడు పిచ్చోళ్లా
రైతులంటే అంత చులకనా
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు అర్బన్: జిల్లాలో శనగరైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ళ పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లనడం చూస్తుంటే చంద్రబాబు వైఖరికి ఏంటో అర్ధమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గాని, మంత్రి గాని జిల్లాలో ఉన్న సమస్యలపై ఏ ఒక్క రోజైనా తమ ముఖ్యమంత్రితో మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రబుత్వం స్పందించి శనగరైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు రూ.75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి రూ.250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరని నిలదీశారు.ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్రను వీడి ప్రజాసమస్యలు, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.