అనుమతి ఇచ్చి అడ్డుకున్నారు | YV Subbareddy Slams TDP Party Leaders Prakasam | Sakshi
Sakshi News home page

అనుమతి ఇచ్చి అడ్డుకున్నారు

Published Tue, Feb 26 2019 12:56 PM | Last Updated on Tue, Feb 26 2019 12:56 PM

YV Subbareddy Slams TDP Party Leaders Prakasam - Sakshi

ఒంగోలు: పార్టీ కార్యాలయానికి ముందస్తు అనుమతులు అన్నీ ఇచ్చి కూడా తన కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలైన అనంతరం బాలినేని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.  తమ వెంట మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన వైవీ సుబ్బారెడ్డి, గరటయ్యవేలాదిమంది కార్యకర్తలు ఉంటే కేవలం వంద మంది కూడా లేని టీడీపీ నాయకులను బూచిగా చూపించి ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా పోలీసుశాఖ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌ సీపీ కమ్మపాలెంలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేవలం తనను చూసి ఎమ్మెల్యే జనార్ధన్‌ భయపడుతున్నాడని స్పష్టమవుతోందన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వచ్చి తనను పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే అనుమతులు తీసుకున్నామన్నారు.

రెండు రోజుల క్రితమే ఫ్లెక్సీలు చించారని, చించిన వ్యక్తి బొల్లినేని వాసు అని ఫిర్యాదు చేసినా కనీసం అతనిని అరెస్టు చేయకపోవడం, కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అనుమతులతో ముందుకు వెళుతుంటే సమస్యలు వస్తాయంటూ తనకు పోలీసు అధికారులు ఇంటికి వచ్చి చెప్పడం, అడుగడుగునా ఆపేందుకు యత్నించడం, తీరా 100 మంది కూడా లేనివారిని కంట్రోల్‌ చేయకుండా అన్ని అనుమతులు తీసుకున్న 2 నుంచి 3 వేలమంది కార్యకర్తలు ఉన్న తమవారిపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం కాదని, నేరుగా ఎదుర్కొనేందుకు దమ్ముంటే ముందుకు రావాలని జనార్ధన్‌కు సవాల్‌ విసురుతున్నానన్నారు. అగ్రహారంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువని, గతంలో అక్కడ రెండు లేదా మూడు ఓట్లు మాత్రమే టీడీపీకి ఉండేవని, కానీ ఇటీవల ఒకరిద్దరిని ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తాము ఏమాత్రం అడ్డుకోలేదన్నారు. దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటుకు ఎస్పీ, కలెక్టర్‌లు అనుమతి ఇవ్వకపోతే తన వద్దకు జనార్ధన్‌ ఆయన బాబాయి పూర్ణచంద్రరావును పంపారని, తాను మాట్లాడి అనుమతి ఇప్పించానన్నారు. దీనిని నా బట్టి నా సంస్కారం ఎలాంటిదో, దామచర్ల కుసంస్కారం ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని బాలినేని పేర్కొన్నారు. కార్యకర్తలపై లాఠీచార్జి చేయడంపై తప్పకుండా కేసు పెడతామని, ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

పోలీసు వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది:  ఒంగోలులో జరిగిన ఘటన రాష్ట్ర పోలీసు వ్యవస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుందనేందుకు ఒక ఉదాహరణ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు ఒక పార్టీకి అండగా ఉంటూ వైఎస్సార్‌ సీపీ  కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేను అయితే బస్సులో కింద కూర్చోబెట్టి రాత్రంతా తమిళనాడులో తిప్పి తెల్లవారుఝామున అనారోగ్యానికి గురైనా పట్టించుకోకుండా సత్యవేడు పోలీసుస్టేషన్‌లో వదిలారన్నారు. దీనిపై చిత్తూరు ఎస్పీ ఇస్తున్న సమాధానం సరిగా లేదని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర పోలీసులు వివక్ష ప్రదర్శిస్తున్నారని, దీనిపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాగానే గవర్నర్‌కు కూడా రాతపూర్వకంగా తెలియజేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి తప్పక అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది: 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇంత వరకు ఒంగోలులో జరిగిన ఘటన నా జీవితంలో నేను చూడలేదు. ఇలాంటి ఘటనలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. అరాచకంగా వ్యవహరించడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడంలేదని మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య అన్నారు. పోలీసులు చివరిదాకా వైఎస్సార్‌ సీపీని అడ్డుకునేందుకు యత్నించడం బాధాకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని బాలినేని చేత ప్రారంభింపజేస్తామన్నారు. భవిష్యత్తులో కూడా టీడీపీ ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని, కార్యకర్తలు సంయమనం వహించి దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

కమ్మపాలెంలోనే బాలినేనికి తొలి పౌర సన్మానం: వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తన కుటుంబానికి ఎంతగానే అండగా నిలిచిందని, ఈ క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం పట్ల ఆకర్షితుడనై బాలినేని సమయంలో పార్టీలో చేరానని కమ్మపాలెంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ఆలూరి శ్రీహరి పేర్కొన్నారు.ఈ క్రమంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నానని, అక్రమంగా ఫ్లెక్సీలు చించితే పోలీసులు కేసు నమోదు చేయకపోయినా తాము అదనంగా ఫ్లెక్సీలను వేసుకున్నామన్నారు. చివరకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సైతం వారు చెప్పినట్లే వేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యవహారం బాధ కలిగిస్తోందన్నారు. గత 20 రోజులుగా తనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయని, అన్నింటికీ సిద్ధపడే తాను పార్టీలోకి వచ్చానన్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు బాలినేని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి పౌరసన్మానం కమ్మపాలెంలోనే నిర్వహిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement