టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద తన అనుచరులతో వైస్ చైర్మన్ జబీవుల్లా
ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీ నాయకుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వైఎస్ జబీవుల్లా తన వర్గీయులతో కలసి వీరంగం సృష్టించారు. మైదుకూరు రోడ్డులో అందరూ చూస్తుండగా వారు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. గురువారం 50 మందికి పైగా ఒక్కసారిగా హోటల్‌లోకి ప్రవేశించి అందులో ఉన్న అహ్‌లే హదీస్ కమిటీ కార్యదర్శి చాపాడు జిలానిబాషాతోపాటు మరి కొందరిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిలానిబాషా పట్టణంలోని దస్తగిరిపేటలో నివాసం ఉంటున్నాడు. అతను ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో హోటల్ నిర్వహించుకుంటూ క్యాటరింగ్ కూడా చేస్తున్నాడు. అతను మూడేళ్ల క్రితం జమాతే అహ్‌లే హదీస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. బైపాస్‌రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద కమిటీ తరపున రంజాన్, బక్రీద్ పండుగలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందుకయ్యే ఖర్చులను చందాల రూపంలో నమాజ్‌కు వచ్చే ప్రజల నుంచి వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఈద్గా వద్ద జిలానిబాషాతో పాటు కమిటీ సభ్యులు జోలె పట్టుకొని చందాలు వసూలు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న వైస్‌చైర్మన్ జబీవుల్లా సోదరుడు మైనుద్దీన్ చందాలు వసూలు చేయొద్దని చెప్పాడు. ఈద్గా పండుగ ఖర్చుల కోసం వసూలు చేస్తున్నాం వద్దని చెబితే ఖర్చులు ఎలా భరించాలని అతనితో అన్నారు. దీంతో మైనుద్దీన్ వారిని పరుష పదజాలంతో తిట్టాడు. వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా అక్కడున్న వారు వారించడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు.
జబీవుల్లా ఫోన్ చేసి బెదిరించాడు..
ఈ క్రమంలో గురువారం ఉదయం వైఎస్ జబీవుల్లా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈద్గాలో జరిగిన సంఘటన గురించి అందరికీ చెప్పావంట కదా.. నీవు ఎక్కడున్నావో చెప్పు వస్తున్నా అని అతను మందీ మార్బలంతో మైదుకూరు రోడ్డులోని హోటల్ వద్దకు వచ్చాడు. జబీవుల్లాతో పాటు సుమారు 50 మందికి పైగా హోటల్‌లోకి ప్రవేశించి రాడ్లు, కట్టెలు, అక్కడే ఉన్న పాలక్యాన్‌లను తీసుకొని విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొందరు విడిపించడంతో జబీవుల్లా, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో జిలానిబాషా గాయ పడ్డాడు. దీంతో ఆగ్రహించిన జిలానిబాషా కుటుంబ సభ్యులు, బంధువులు వైస్ చైర్మన్ జబీవుల్లా దౌర్జన్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. గాయపడిన జిలానిబాషాను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో అహ్‌లే హదీస్ కమిటీ æసభ్యులు పెద్ద ఎత్తున జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సీఐలు వెంకటశివారెడ్డి, ఓబులేసు ఆస్పత్రికి చేరుకొని విచారించారు. జిలానిబాషా ఫిర్యాదు మేరకు జబీవుల్లాతో పాటు ముజాహిద్దీన్, ఆరిఫ్, జుబేర్, చక్రి మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని జబీవుల్లా డ్రైవర్ చక్రీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిలానిబాషా, ఆయన కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment