నవంబర్‌లో బదిలీ.. ఇప్పుడు రిలీవ్! | Zilla Parishad officers Transfer in November now reliv | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో బదిలీ.. ఇప్పుడు రిలీవ్!

Published Sun, Feb 1 2015 2:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

నవంబర్‌లో బదిలీ..  ఇప్పుడు రిలీవ్! - Sakshi

నవంబర్‌లో బదిలీ.. ఇప్పుడు రిలీవ్!

శ్రీకాకుళం: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జిల్లాపరిషత్ అధికారులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. వీరి నిర్వాకం వల్ల చేయని తప్పునకు చిరుద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. గత నవంబరులో జరిగిన బదిలీల్లో జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు. వారి స్థానాల్లో అంతమందినే వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి ఉండగా, అంతకంటే ఎక్కువగా 11 మందిని జెడ్పీ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఁసాక్షిరూ.లో కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతారేమోనన్న భయంతో తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాష్ అనే జూనియర్ అసిస్టెంట్‌ను నవంబరులో సరుబుజ్జిలి ఎమ్పీడీవో కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కుప్పిలి గీతను జెడ్పీ కార్యాలయంలో నియమించారు.
 
 అయితే ఏ కారణంతోనో అప్పట్లో ప్రకాష్‌ను రిలీవ్ చేయలేదు. గీత మాత్రం సరుబుజ్జిలిలో రిలీవ్ అయి శ్రీకాకుళం వచ్చేశారు. పోస్టు ఖాళీగా లేదనో.. మరే కారణమో తెలియక పోయినా గీత మెడికల్ లీవ్ పెట్టేశారు. మరోవైపు ప్రకాష్‌ను రిలీవ్ చేయకుండా మూడు నెలల పాటు జిల్లాపరిషత్ కార్యాలయంలో జీతం చెల్లించారు. తాజాగా శుక్రవారం ఈయన్ను గత ఉత్తర్వులు అమలు చేశామని చెప్పుకొనేందుకు సరుబుజ్జిలిలో నియమిస్తూ రిలీవ్ చేసేశారు. ప్రస్తుతం బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమైందన్నది అంతుచిక్కడం లేదు. అలాగే ఎవరినైనా బదిలీ చేస్తే వారం రోజుల్లోగా రిలీవ్ కావల్సి ఉంటుంది. అలా కాకుంటే బదిలీ ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.
 
 ఇటువంటి సందర్భాల్లో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకునే వీలుంది. ప్రస్తుతం ప్రకాష్‌ను సరుబుజ్జిలికి బదిలీ చేయడం, ఆయన అక్కడ విధుల్లో చేరడంతో ప్రభుత్వ ఆంక్షల మేరకు ఈయనకు జీతం చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు అభ్యంతరం చెప్పే అవకాశముంది. అలాగే కుప్పిలి గీత సరుబుజ్జిలిలో రిలీవ్ అయినా మూడు నెలలపాటు ఎక్కడా విధుల్లో చేరనందున ఆమెకు జీతాలు చెల్లింపు అంశాన్ని రాష్ట్ర అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈమెకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వక పోగా ఫారన్ సర్వీసెస్ కింద శ్రీకాకుళం పట్టణంలోని ఏదైనా వేరొక శాఖ కార్యాలయంలో నియమిస్తామని హామీ ఇస్తూ జెడ్పీ అధికారులు కాలయాపన చేస్తున్నట్టు భోగట్టా. దీని వల్ల జీతం, సర్వీసు విషయంలో గీత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.
 
 అయినా అధికారులు, వారిపై ఒత్తిడి తెస్తున్న ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే జెడ్పీలో పనిచేస్తున్న మరో జూనియర్ అసిస్టెంట్‌ను గత స్థానంలో పనిచేస్తున్నట్లుగా చూపించి అక్కడే జీతం చెల్లిస్తూ.. జెడ్పీ కార్యాలయంలో అనధికారికంగా డిప్యుటేషన్‌పై పనిచేయించాలని జెడ్పీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే సిబ్బంది సూచనల మేరకే అధికారులు ఇటువంటి నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నారని జెడ్పీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో వసంతరావు వద్ద ఁసాక్షిరూ. ప్రస్తావించగా తాజాగా ప్రకాష్ అనే ఉద్యోగిని బదిలీ చేయడం నిజమేనన్నారు. గీత అనే ఉద్యోగికి సెట్‌శ్రీలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement