
జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలు ఖరారు ?
ఒక్కొక్క దానిలో ఏడుగురు సభ్యులు
సభ్యులందరికీ ప్రాధాన్యం
చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉదయం స్టాండింగ్ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. జెడ్పీటీసీ సభ్యులతో జిల్లా అధికారులకు పరిచయ కార్యక్రమాల అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. మొత్తం ఏడు స్థాయి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. ప్రణాళిక, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం పనుల కమిటీల్లో సభ్యులను నియమించినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్క కమిటీకి ఏడుగురు జెడ్పీటీసీలు చొప్పున 49మంది జెడ్పీటీసీలకు ప్రాధాన్యత కల్పించారు. అయితే ప్రణాళిక, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యసేవలు పనుల కమిటీలకు జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనూరాధ కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ కమిటీకి వైస్‌చైర్మన్ శాయన పుష్పావతి అధ్యక్షురాలిగా, మహిళా సంక్షేమం కమిటీకి పామర్రు జెడ్పీటీసీ సభ్యులు పొట్లూరి శశి, సాంఘిక సంక్షేమ కమిటీకి బంటుమిల్లి జెడ్పీటీసీ దాసరి కరుణజ్యోతిని కమిటీ చైర్మన్లుగా నియమించినట్లు సమాచారం. ఈ కమిటీల నియామక ప్రక్రియ సర్వసభ్య సమావేశంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.